ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. వారందరికీ ఉచితంగా ఇళ్లు.

మది పేదల ప్రభుత్వం అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఇల్లు లేని పేదలను గుర్తించే ప్రక్రియ డిసెంబర్ 1వ తేదీ నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.


2029 నాటికి ప్రతి కుటుంబానికి సొంతిల్లు ఉండాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. అంతేకాకుండా పునరుత్పాదక విద్యుత్ కోసం ఇంటిపై సోలార్ పెట్టుకునేలా ప్రోత్సహిస్తామని వెల్లడించారు. ఈ మేరకు అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం దేవగుడిపల్లిలో గృహప్రవేశాల కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి.. మూడు లక్షల గృహాలను వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా 17 నెలల్లో ఇళ్లు పూర్తి చేసి.. ప్రారంభించినట్లు పేర్కొన్నారు.

ఉగాది నాటికి మరో 5.9 లక్షల ఇళ్లు..

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రసంగించారు. ఇల్లు అంటే నాలుగు గోడలు కాదన్న ముఖ్యమంత్రి.. భవిష్యత్తుకు భద్రత అని అభివర్ణించారు. పేదలకు తొలిసారి పక్కా ఇళ్లు నిర్మించింది ఎన్టీఆర్‌ అని అన్నారు. కూడు, గూడు, దుస్తులు.. అనే నినాదంతో తెలుగుదేశం పార్టీ పుట్టిందని తెలిపారు. మిగతా ఇళ్ల పనులు కూడా పూర్తి చేసి.. ఉగాది నాటికి 5.9 లక్షల గృహ ప్రవేశాలు చేయిస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా మంగళవారం (నవంబర్ 11) కనిగిరిలో 97 పరిశ్రమలు ప్రారంభించామని తెలిపిన సీఎం.. ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారుచేసే బాధ్యత తనదేనన్నారు.నా జీవితాశయం ఇదే..

ఇప్పటికే రాష్ట్రానికి పెట్టుబడులు తరలివస్తున్నాయన్న ముఖ్యమంత్రి.. రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పిల్లలు ఎక్కడ చదువుకుంటే అక్కడే ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. వర్క్‌ఫ్రం హోమ్ ద్వారా ఇంటి నుంచే పనిచేసుకోవచ్చని తెలిపారు. అలా ఎక్కడి వాళ్లు అక్కడే పనిచేసుకునేలా పరిస్థితులు కల్పిస్తామన్నారు. అంతేకాకుండా శ్రీనివాసపురం రిజర్వాయర్‌ పూర్తిచేసే బాధ్యత తనదేనన్నారు. చెరువులకు పునర్వైభవం తెచ్చి.. భూగర్భ జలాలు పెంచడమే తమ లక్ష్యం అని పేర్కొన్నారు. కాగా, తన జీవితాశం నదులను అనుసంధానించడమేనన్నారు సీఎం. ఈ మహత్తర ఘట్టం పూర్తైతే.. రాష్ట్రంలోని ప్రతి ఎకరానికి నీళ్లు అందుతాయని చెప్పారు. అయితే తాను ఎప్పుడూ తాగునీటి ప్రాజెక్టులపై నిర్లక్ష్యం వహించనని పేర్కొన్నారు.జగన్‌ హయాంలో సర్వనాశనం..: చంద్రబాబు

ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి జగన్‌పై విమర్శలు గుప్పించారు సీఎం చంద్రబాబు. జగన్‌ ఐదేళ్లలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఆరోపించారు. వైసీపీ హయాంలో ఏపీ ఆర్థికంగా దివాళా తీసిందని.. రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చారని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో 4.73 లక్షల ఇళ్లను రద్దు చేశారన్న సీఎం.. నివాస యోగ్యం కాని ప్రాంతంలో ఇళ్ల స్థలాలు ఇచ్చారని ఆరోపించారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.