ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అనేకమందిని వేదిస్తున్న అతి సాధారణ ఆరోగ్య సమస్యల్లో డయాబెటిస్ ఒక్కటి. దాని నియంత్రణ చికిత్సలో భాగంగా బాధితులు ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకుంటుంటారు.
అయితే ఇకముందు ఇంజెక్షన్లకు బదులుగా శరీరంపై అతికించుకుంటే చాలు మధుమేహం కంట్రోల్ అయ్యే అధునాతన ‘స్మార్ట్’ ఇన్సులిన్ ప్యాచ్‌ను UNC-Chapel Hill, అండ్ NC State University పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఇది డయాబెటిస్ బాధితుల జీవితాలను మార్చే సాంకేతికతగా నిపుణులు పేర్కొంటున్నారు.
మైక్రో నిడిల్స్‌తో కప్పబడి
పరిశోధకులు డెవలప్ చేసిన స్మార్ట్ ఇన్సులిన్ ప్యాచ్ సుమారు 1.9 సెం.మీ వ్యాసం కలిగి ఉంటుంది. అంటే అమెరికన్ నాణెం సైజులో ఉంటుంది. అయితే ఇది కోట్లాది మంది డయాబెటిస్ బాధితులకు రోజూ తీసుకోవాల్సిన ఇంజెక్షన్ల అవసరాన్ని తగ్గిస్తుందని పరిశోధకులు అంటున్నారు. ఎందుకంటే ఇది మైక్రోనిడిల్స్‌తో కప్పబడిన ప్యాచ్. ఇందులోని ప్రతీ నిడిల్ చాలా చిన్నది.
ఆటోమేటిక్ ఇన్సులిన్ రిలీజ్
స్మార్ట్ ప్యాచ్‌లోని అతి సూక్ష్మమైన నిడిల్స్ బ్లడ్ షుగర్ స్పైక్స్‌ను గుర్తించి కచ్చితమైన ఇన్సులిన్ మోతాదును ఆటోమాటిక్‌గా విడుదల చేస్తాయి. కాబట్టి మాన్యువల్ టెస్టింగ్ అవసరం లేకుండానే ఈ అధునాతన ప్యాచ్ మాన్యువల్ ఫింగర్ ప్రిక్స్ లేదా ఇంజెక్షన్ల అవసరాన్ని తొలగిస్తుంది.
ప్యాచ్.. లక్షణాలు
శాస్త్రవేత్తలు డెవలప్ చేసిన స్మార్ట్ ప్యాచ్ నొప్పిలేకుండా (painless), త్వరగా పనిచేసే (fast-acting) కచ్చితమైన(precise) సూక్ష్మ సాంకేతికత ఆధారంగా రూపొందించబడింది. ప్రస్తుతం ఇది ఒకసారి ధరిస్తే దాని ప్రభావం సుమారు 12 గంటలు ఉంటుంది. అయితే శాస్త్రవేత్తలు దీనిని వారం రోజులు పనిచేసేలా దాని సమయాన్ని పొడిగించడానికి పరిశోధనలు కొనసాగిస్తున్నారు. అదే గనుక జరిగితే డయాబెటిస్ బాధితులు ప్రతిరోజూ ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకునే రిస్క్ తప్పుతుందని నిపుణులు అంటున్నారు.



































