రైతుల ఖాతాల్లోకి రూ.7 వేలు.. అన్నదాత, పీఎం కిసాన్ డబ్బులు వచ్చేశాయి

రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తున్న అన్నదాత, పీఎం కిసాన్ డబ్బుల వచ్చేశాయి. మరి, మీకు ఖాతాలో పడ్డాయా? లేదా అనేది ఇలా చెక్ చేసుకోండి…


రైతుల ఆదాయాన్ని పెంచి, వ్యవసాయ పెట్టుబడుల భారం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘పీఎం–కిసాన్ సమ్మాన్ నిధి’ పథకం మరోసారి కీలక దశను చేరుకుంది. 21వ విడత నిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం తమిళనాడులోని కోయంబత్తూరులో నిర్వహించిన భారీ కార్యక్రమంలో అధికారికంగా విడుదల చేశారు. ఈ విడతలో దేశవ్యాప్తంగా తొమ్మిది కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో మొత్తం రూ.18 వేల కోట్లకు పైగా నేరుగా జమ కానున్నాయి. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రైతుల కోసం అన్నదాత పథకం కింద నిధులను విడుదల చేశారు చంద్రబాబు. పూర్తి వివరాలు తెలుసుకుందా పదండి.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, రసాయన ఎరువులు, పురుగుమందుల అధిక వినియోగం నేల సారాన్ని దెబ్బతీస్తోందని, దీని ప్రభావం మొత్తం పంట చక్రంపై పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి ప్రత్యామ్నాయంగా పంట వైవిధ్యీకరణ, సేంద్రియ విధానాలు పెద్ద ఎత్తున అనుసరించాలన్నారు. వాతావరణ మార్పుల దుష్ప్రభావాలను ఎదుర్కోవడంలో సేంద్రియ వ్యవసాయం కీలక పాత్ర పోషిస్తుందని, భారత్ ప్రపంచానికి ఈ రంగంలో ఆదర్శంగా నిలిచే దిశగా అడుగులు వేస్తోందని తెలిపారు. తృణ ధాన్యాలను ‘సూపర్ ఫుడ్’ గా పేర్కొంటూ, రైతులు ఈ పంటలను విస్తృతంగా సాగు చేయాలని సూచించారు.

2019లో ప్రారంభమైన ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 20 విడతల్లో రూ.3.70 లక్షల కోట్లకు పైగా రైతుల ఖాతాల్లోకి నేరుగా జమ చేయబడినట్లు కేంద్రం ప్రకటించింది. రైతు భూమి వివరాలు PM-KISAN పోర్టల్‌లో నమోదు చేసి ఉండటం, బ్యాంక్ ఖాతా ఆధార్‌తో అనుసంధానం కావడం వంటి అర్హతలు ఉన్నవారికి ఈ ప్రయోజనం లభిస్తోంది.

అదేరోజు, ఆంధ్రప్రదేశ్‌లో సీఎం చంద్రబాబు నాయుడు వైఎస్‌ఆర్ కడప జిల్లా పెండ్లిమర్రిలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రానికి సంబంధించిన అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ రెండో విడత నిధులను విడుదల చేశారు. మొత్తం 47 లక్షల మంది రైతులకు రూ.3,200 కోట్ల సాయం ప్రకటించబడింది. ఒక్కో రైతు ఖాతాలో రూ.7,000 చొప్పున జమ అయింది. రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఈ నిధులు అందుకున్నారా లేదా అన్నది ఆన్‌లైన్‌లో చెక్ చేసుకునే అవకాశం కల్పించారు.

రైతులు annadathasukhibhava.ap.gov.in వెబ్‌సైట్‌ లోకి వెళ్లి Know Your Status ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఆధార్ నంబర్, కాప్చా నమోదు చేసిన తర్వాత, ఆయా రైతుకు సంబంధించిన జిల్లా, మండలం, గ్రామం, కేవైసీ పూర్తయిందా లేదా, డబ్బు ఏ బ్యాంక్ ఖాతాలో జమ అయిందనే వివరాలు స్పష్టంగా కనిపిస్తాయి.

పీఎం–కిసాన్, అన్నదాత సుఖీభవను సమన్వయంతో అమలు చేస్తుండటంతో ప్రయోజనం మరింత విస్తరించిందని అధికారులు చెబుతున్నారు. ఈ రెండు పథకాల ద్వారా రైతులపై పెట్టుబడి భారం గణనీయంగా తగ్గుతుందని వ్యవసాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

 

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.