కేవలం 5 గంటల్లో హైదరాబాద్‌ TO బెంగళూరు! – ఆరు వరుసలతో హైస్పీడ్‌ గ్రీన్‌ఫీల్డ్‌ హైవే

హైదరాబాద్‌ నుంచి ఏపీ మీదుగా బెంగళూరుకు హైస్పీడ్‌ గ్రీన్‌ఫీల్డ్‌ కారిడార్‌ నిర్మాణం జరగనుంది. ఏపీలోని కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల మీదుగా ఇది వెళ్తుంది. ఇప్పుడున్న హైదరాబాద్‌-బెంగళూరు జాతీయ రహదారి-44కు సమాంతరంగా దీనిని నిర్మించేలా డీపీఆర్‌ సిద్ధం చేస్తున్నారు. దీనికోసం మూడు ఎలైన్‌మెంట్లు తయారు చేస్తున్నారు. వీటిలో ఒకదానిని జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ (మోర్త్‌) ఎలైన్‌మెంట్‌ అప్రూవల్‌ కమిటీ ఆమోదించనుంది.


5 గంటల్లో చేరుకునేలా : ప్రస్తుతం ఎన్‌హెచ్‌-44పై ప్రయాణించి హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు చేరేందుకు 8-9 గంటలు పడుతోంది. కొత్తగా నిర్మించనున్న హైస్పీడ్‌ కారిడార్‌లో కేవలం 5 గంటల్లో చేరుకునేలా చూడనున్నారు. 120 కి.మీ. వేగంతో వాహనాలు పరుగులు పెట్టేలా డిజైన్‌ రూపొందిస్తున్నారు.

ఆరు వరుసలతో గ్రీన్‌ఫీల్డ్‌ కారిడార్‌ : వాస్తవానికి ఇప్పుడున్న ఎన్‌హెచ్‌-44నే నాలుగు వరుసలు నుంచి ఆరుగాని, ఎనిమిది వరుసలకుగాని విస్తరించాలని తొలుత భావించారు. అయితే ఈహైవేకి ఆనుకొని కర్నూలు, అనంతపురం నగరాలతోపాటు, అనేకచోట్ల నివాస ప్రాంతాలు ఉన్నాయి. దీంతో ఇక్కడ విస్తరణ కష్టమన్న నిర్ణయానికి వచ్చారు. కొత్తగా ఆరు వరుసలతో గ్రీన్‌ఫీల్డ్‌ కారిడార్‌ నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్‌-బెంగళూరు హైవే-44 తెలంగాణలో 210 కి.మీ., ఏపీలో 260 కి.మీ., కర్ణాటకలో 106 కి.మీ. మేర కలిపి మొత్తం 576 కి.మీ.ఉంది. కొత్త హైస్పీడ్‌ కారిడార్‌ కూడా ఎన్‌హెచ్‌-44కు 10-15 కి.మీ. దూరంలో దాదాపు సమాంతరంగా వెళ్లనుంది.

అడ్వాన్స్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ విధానం : కొన్నిచోట్ల మాత్రమే ఈ హైవేలోకి ప్రవేశించేందుకు (ఎంట్రీ), బయటకు వచ్చేందుకు (ఎగ్జిట్‌) అవకాశం కల్పిస్తారు. కారిడార్‌ మధ్య ఎక్కడైనా ఇతర ఎన్‌హెచ్‌లను క్రాస్‌ చేస్తే అక్కడ ట్రంపెట్‌ ఇంటర్‌ ఛేంజ్‌లు నిర్మిస్తారు. కారిడార్‌ మొత్తం నాలుగైదు మీటర్ల ఎత్తులో ఉండనుంది. దీనిపై అడ్వాన్స్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ విధానం అమలు చేయనున్నారు.

ఏపీ పరిధిలో రూ.13 వేల కోట్ల వ్యయం :

  • ఈ ప్రాజెక్ట్‌ కోసం సలహా సంస్థ ద్వారా మూడు ఎలైన్‌మెంట్లను సిద్ధం చేయిస్తున్నారు.
  • 100 మీటర్ల వెడల్పుతో భూసేకరణ ఉండేలా చూడనున్నారు.
  • ఏపీ పరిధిలో హైస్పీడ్‌ కారిడార్‌ నిర్మాణానికి రూ.13 వేల కోట్ల వ్యయం అవుతుందని అంచనా.
  • మూడు ఎలైన్‌మెంట్లలో ఒకటి ఖరారు అయ్యాక వ్యయం ఎంత అవుతుందనేది తేలనుంది.
  • ఫిబ్రవరి నాటికి డీపీఆర్‌ సిద్ధం చేయాలని సలహా సంస్థకు ఎన్‌హెచ్‌ఏఐ గడువు విధించింది.
  • మరోవైపు దక్షిణ భారతదేశంలోని మూడు ప్రధాన రాష్ట్రాలైన కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడును అనుసంధానం చేస్తూ నిర్మాణం జరుగుతున్న బెంగళూరు-చెన్నై ఎక్స్‌ప్రెస్ హైవే ఇప్పుడు తుదిదశకు చేరుకుంది. ఈ హైవే అందుబాటులోకి వస్తే చిత్తూరు జిల్లావాసులు గంటన్నరలోనే బెంగళూరు లేదా చెన్నై చేరుకునే వీలుంటుంది. వి.కోట ప్రాంతం నుంచి అయితే కేవలం గంటలోనే బెంగళూరు చేరుకోవడం సాధ్యమవుతుంది. గరిష్ఠ వేగం గంటకు 120 కి.మీగా నిర్ధారించిన ఈ రహదారి, రాష్ట్రాల మధ్య వాణిజ్యం, పర్యాటకం, పారిశ్రామిక అభివృద్ధికి కొత్త ఊపునిచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.