బంకుల్లో సౌకర్యాలు ఉచితం గురూ..

బంకుల్లో పెంట్రోలు కొట్టించుకునే వారిలో చాలా మందికి అక్కడ నిర్వాహకులు కల్పించాల్సిన సౌకర్యాలపై అవగాహన ఉండదు. దీన్ని ఆసరాగా చేసుకుని నిర్వాహకులు వాటికి ఎగనామం పెట్టేస్తుంటారు. అడిగినా పట్టించుకోరు.. ఎక్కడ పిర్యాదు చేయాలో తెలియక.. ఏం చేయలేక చాలా మంది మదన పడుతుంటారు. ఇంకెందుకు ఆలస్యం తెలుసుకుందాం పదండి..


  • బంకుల్లో ఎలక్ట్రానిక్‌ ఎయిర్‌ ఫిల్‌ యంత్రం ఉండాలి. దాని ద్వారా ఉచితంగా వాహనాల్లో గాలి నింపాలి. ఇందు కోసం ప్రత్యేకంగా ఓ ఉద్యోగి విధుల్లో ఉండాలి. ఇంధనం పోయించుకున్న వారికే ఉచితంగా గాలి పెడతారని చాలా మందికి అపోహ ఉంది. ఏ వాహనానికైనా నింపాల్సిందే. ఈ నిబంధనల తెలియక చాలా మంది మెకానిక్‌ల వద్ద గాలి నింపినందుకు రూ.20-30 ఖర్చు చేస్తున్నారు.
  • అత్యవసర సమయం, లేదా ప్రమాదాలు సంభవించినప్పుడు బంధువులు, అవసరమైన వ్యక్తులకు ఫోన్‌ చేసుకునేందుకు బంకుల్లో ఫోన్‌ సదుపాయం ఉండాలి.
  • ఇంధనం నింపే వేళ లేదా ఇతర సమయాల్లో మంటలు రేగితే అదుపునకు అగ్నిమాపక పరికరాలు ఉండాలి. నిర్వాహకులు, ఏజెన్సీ వివరాలు, ఫోన్‌నంబర్లు ప్రదర్శించాలి.
  • వినియోగదారులకు తాగునీటి సౌకర్యం కల్పించాలి. చాలా దుకాణాల్లో ఉదయం ఒక బాటిల్‌ పెట్టి నీరు అయిపోయాక మళ్లీ పెట్టకుండా వదిలేస్తున్నారు. పెట్రోల్‌ బంకు పనిచేస్తున్నంత సేపు తాగునీరు అందుబాటులో ఉంచాలి.
  • వినియోగదారులకు ఉచిత మరుగుదొడ్లు సౌకర్యం కల్పించాలి. వాటిని శుభ్రంగా ఉంచాలి.
  • ప్రమాదాలు, ఇతర ఇబ్బందుల నేపథ్యంలో బంకుల్లో తప్పనిసరిగా ప్రథమ చికిత్స పెట్టె, అత్యవసర మందులు అందుబాటులో ఉండాలి.

ఇలా చేయవచ్చు.. ఉమ్మడి జిల్లాలో 340 పెట్రోల్‌ బంకులున్నా 70శాతం పైగా నిబంధనల ఊసేలేదు. ఇబ్బందులను జీవీపోర్టల్‌.జీవోవీ.ఇన్‌ అనే వెబ్‌సైట్‌లో లేదా మండల, జిల్లా స్థాయి గ్రీవెన్స్‌లోనూ ఫిర్యాదు చేయవచ్చు. నేరుగా తహసీల్దార్, జిల్లా పౌర సరఫరాల సంస్థ అధికారి, సదరు ఏజెన్సీకైనా ఫిర్యాదు చేయవచ్చు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.