బ్యాంక్ ఆఫ్ ఇండియా.. దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ బ్రాంచుల్లోని పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 115 చీఫ్ మేనేజర్, సీనియర్ మేనేజర్, మేనేజర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు నవంబర్ 30, 2025వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత విభాగంలో ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీటెక్/బీఈ, ఎంఎంఎస్సీ, ఎంసీఏలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి 2025 అక్టోబర్ 1వ తేదీ నాటికి 22 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్ధులకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ అర్హతలు ఉన్న వారు ఎవరైనా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.850, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు రూ.175 చొప్పున రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించవచ్చు. ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.64,820 నుంచి రూ.1,20,940 వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర వివరాలు ఈ కింది నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోండి.
రాత పరీక్ష విధానం..
ఆన్‌లైన్ విధానంలో జరిగే రాత పరీక్ష మొత్తం 125 మార్కులకు ఉంటుంది. ఇందులో ఇంగ్లిష్ లాంగ్వేజ్ టెస్ట్‌కు 25 మార్కులు, ప్రొఫెషనల్ నాలెడ్జ్ టెస్ట్ 100 మార్కులకు ఉంటుంది. మొత్తం 100 నిమిషాల పాటు ఈ పరీక్ష నిర్వహిస్తారు. నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. రాత పరీక్షలో అర్హత సాధించిన వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
































