ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం అమరావతి సచివాలయంలో జరిగిన కీలక సమావేశంలో మూడు కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆమోదం తెలిపారు.
మార్కాపురం, మదనపల్లె, రంపచోడవరం జిల్లాలు ఏర్పాటు చేయడానికి మంత్రివర్గ ఉపసంఘానికి మార్గదర్శకాలు ఇచ్చారు. ఈ మార్పులు ప్రజల సౌకర్యం, భౌగోళిక సౌలభ్యం, పరిపాలనా సౌకర్యాలు పెరగేలా ఉండాలని సీఎం ఆదేశించారు.
కొత్త జిల్లాలు, రెవిన్యూ డివిజన్లు జనవరి ఒకటి నుంచి అమల్లోకి !
సమావేశంలో కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు, జిల్లా సరిహద్దుల మార్పులపై కూడా పూర్తి చర్చ జరిగి పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ మార్పులు 2026 జనవరి నుంచి అమలులోకి వచ్చేలా కార్యాచరణ ఉంటుంది. అమరావతి సచివాలయంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడాడ పాల్గొన్నారు. ఇతర కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు కూడా హాజరయ్యారు. ఉపసంఘం సమర్పించిన నివేదికలో కొన్ని సూచనలు ఇచ్చి, మరిన్ని సవరణలు చేయమని ఆదేశించారు.
ప్రజల సౌకర్యార్థమే కొత్త జిల్లాల ఏర్పాటు, సరిహద్దుల మార్పు
మార్కాపురం జిల్లాలో కనిగిరి, గిద్దలూరు, ఎర్రగొండపాలెం, దర్శి ప్రాంతాలను కలుపుతూ కొత్త జిల్లా ఏర్పాటు చేస్తారు. దీనితో ఈ ప్రాంత ప్రజలు ఒంగోల్కు 200 కి.మీ. ప్రయాణాలు తగ్గుతాయి. సీఎం ఈ డిమాండ్కు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. అన్నమయ్య, చిత్తూరు జిల్లాల నుంచి మదనపల్లె, పిల్లేరు, పుంగనూరు, తంబలపల్లె మండలాలను కలుపుతూ మదనపల్లె జిల్లాను ఏర్పాటు చేస్తారు. అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి చింతూరు, రంపచోడవరం రెవెన్యూ డివిజన్లు, సమీప మండలాలను కలుపుతూ రంపచోడవరం జిల్లా ఏర్పాటు చేస్తారు. ఈ ప్రాంతాలు ప్రస్తుతం జిల్లా కేంద్రానికి 215 కి.మీ. ప్రయాణం చేయాల్సి ఉంది. ఆ సమస్యలు పరిష్కారం అవుతాయి. ట్రైబల్ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక అథారిటీ ఏర్పాటు చేయాలని సూచించారు.
29కి చేరనున్న జిల్లాల సంఖ్య
కొన్ని జిల్లాల సరిహద్దులు కూడా మార్చనున్నారు. అద్దంకి , కందుకూరులను ప్రకాశం జిల్లాలో కలుపుతారు. ఎన్టీఆర్, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో సరిహద్దులను మార్చేందుకు సూచనలు ఇచ్చారు. కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. అడ్డంకి, మదకశీర, గిద్దలూరు, పిల్లేరు ప్రాంతాల్లో కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. గూడూరు డివిజన్ను తిరుపతి నుంచి నెల్లూరు జిల్లాకు మార్పు, చిత్తూరు జిల్లా నగరి రెవెన్యూ డివిజన్ను తిరుపతి జిల్లాలోకి చేర్చడం, బనగనపల్లె రెవెన్యూ డివిజన్ ఏర్పాటును తాత్కాలికంగా నిలిపివేయడం వంటి నిర్ణయాలు ఆమోదించారు. ఈ నిర్ణయాలు రాష్ట్రంలోని 26 జిల్లాలను 29కి పెంచుతాయి. మంత్రివర్గ ఉపసంఘం త్వరలో సవరించిన నివేదిక సమర్పించనుంది.
































