రేవంత్ సర్కార్ కొత్త నిబంధనలు.. అలా చేస్తే ప్రభుత్వ ఉద్యోగం ఊస్ట్.

ప్రభుత్వ పాఠశాలల్లో కొందరు ఉపాధ్యాయులు సమయపాలన పాటించకపోవడం, ఇష్టానుసారంగా సెలవులు పెట్టడంపై పాఠశాల విద్యాశాఖ కఠిన చర్యలకు ఉపక్రమించింది. ముఖ గుర్తింపు హాజరు (FRS) విధానం అమలులోకి వచ్చిన తర్వాత ఉపాధ్యాయుల హాజరు, అనధికారిక గైర్హాజరు వివరాలపై విద్యాశాఖ దృష్టి సారించింది.


పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నవీన్ నికోలస్ సోమవారం డీఈవోలతో ఆన్‌లైన్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. ఒక ఉపాధ్యాయుడు అధికారికంగా సెలవు పత్రం ఇవ్వకుండా, చెప్పా పెట్టకుండా నెల రోజులపాటు విధులకు గైర్హాజరైతే వారిని శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించాలి అని డీఈవోలకు సూచించారు.

వాస్తవానికి ఒక్క రోజు అనధికార గైర్హాజరుపైనా చర్యలు తీసుకోవచ్చు. అయినప్పటికీ ఉపాధ్యాయులు అనారోగ్యం లేదా ప్రమాదం వంటి సాకులు చెప్పి కోర్టుల్లో కేసులు వేసే అవకాశం ఉన్నందున.. నెల రోజుల గడువు తర్వాత షోకాజ్ నోటీసులు జారీ చేసి విచారణ జరిపి తొలగించాలని నిర్ణయించారు. తొలగింపు వివరాలను గెజిట్‌లో కూడా ప్రచురించాలని ఆదేశించారు. గత ఆగస్టు నుంచి అమలులో ఉన్న FRS విధానం ద్వారా టీచర్లు పాఠశాలకు వచ్చిన, వెళ్లిపోయిన సమయం కచ్చితంగా నమోదవుతోంది. ఇప్పటివరకు కేవలం హాజరు అయ్యారా లేదా అనే దానిపైనే దృష్టి పెట్టగా.. ఇకనుంచి ఆలస్యంగా వచ్చే ఉపాధ్యాయులపైనా చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు. FRS అమలుతో కొంత ఆలస్యంగా వస్తా.., ముందుగా వెళ్తా.. అని అడిగే మొహమాటాలు హెచ్‌ఎంలకు తప్పాయని, భవిష్యత్తులో సమయపాలనపై మరింత పకడ్బందీగా చర్యలు ఉంటాయనే భావన ఉపాధ్యాయుల్లో ఏర్పడిందని గెజిటెడ్ హెచ్‌ఎంలు చెబుతున్నారు.

దీర్ఘకాలిక సెలవులు తీసుకొని, వాటిని పొడిగించుకోకుండా ఒకటి, రెండేళ్ల పాటు విధులకు హాజరు కాని ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. ఎక్కువగా విదేశాల్లోని తమ పిల్లలు లేదా భాగస్వాముల వద్దకు వెళ్లేందుకే ఈ సెలవులు తీసుకుంటున్నారు. అలాంటి వారిని గత రెండేళ్లలో సుమారు 50 మందిని విద్యాశాఖ ఉద్యోగం నుంచి తొలగించింది. ప్రస్తుతం రాష్ట్రంలోని దాదాపు 24 వేల పాఠశాలల్లో 1.15 లక్షల మంది టీచర్లు పనిచేస్తుండగా.. వీరిలో 6,100 మంది డిప్యుటేషన్లపై ఇతర విభాగాల్లో ఉన్నారు. దీర్ఘకాలికంగా విధులకు గైర్హాజరవుతున్న మిగిలిన ఉపాధ్యాయులను కూడా గుర్తించి తొలగింపు చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులు డీఈవోలను ఆదేశించారు. ఈ కొత్త నిబంధనల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల పనితీరు, హాజరు మెరుగుపడుతుందని విద్యాశాఖ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.