భారత్‌లో మొట్టమొదటి ప్రభుత్వ ఏఐ క్లినిక్‌ వచ్చేసింది

భారతదేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. గ్రేటర్ నోయిడాలోని గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (GIMS), దేశంలోనే మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) క్లినిక్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.


జనవరి 6న ఫిజికల్ లాంచ్‌కు సిద్ధమవుతున్న ఈ క్లినిక్, కేవలం టెక్నాలజీ ప్రదర్శన మాత్రమే కాదు.. భారతీయ రోగుల అవసరాలకు అనుగుణంగా చికిత్స అందించే ఒక వినూత్న వేదిక.

పాశ్చాత్య డేటాకు స్వస్తి.. భారతీయ మూలాలకు ప్రాధాన్యత

ఇప్పటివరకు మన దేశంలో అనుసరిస్తున్న అనేక వైద్య పరిశోధనలు, చికిత్సలు పాశ్చాత్య దేశాల డేటాపై ఆధారపడి ఉన్నాయి. అయితే, విదేశీయుల జీవనశైలి, జన్యు నిర్మాణం (Genetics), ఆహారపు అలవాట్లు భారతీయులతో పోలిస్తే భిన్నంగా ఉంటాయి. ఈ వ్యత్యాసం వల్ల కొన్నిసార్లు చికిత్సలు ఆశించిన ఫలితాలను ఇవ్వవు. ఈ లోపాన్ని సరిదిద్దుతూ, భారతీయ రోగుల రియల్ టైమ్ డేటా ఆధారంగా మన దేశీ వ్యాధి నమూనాలను విశ్లేషించడం ఈ AI క్లినిక్ ప్రధాన ఉద్దేశ్యం.

AI క్లినిక్ ఎలా పనిచేస్తుంది?

ఈ క్లినిక్ కేవలం సాఫ్ట్‌వేర్ మాత్రమే కాదు, ఇది వైద్యులు, పరిశోధకులు మరియు హెల్త్-టెక్ స్టార్టప్‌ల కలయిక.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు జన్యు స్క్రీనింగ్ (Genetic Screening) ద్వారా క్యాన్సర్, గుండె జబ్బులు, కిడ్నీ మరియు కాలేయ వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తిస్తుంది.

రేడియాలజిస్టులు మరియు పాథాలజిస్టుల సామర్థ్యాన్ని ఇది దాదాపు 40 శాతం పెంచుతుంది. ఎక్స్‌రేలు, సీటీ స్కాన్లు, ఎంఆర్‌ఐలను సెకన్ల వ్యవధిలోనే విశ్లేషించి, కంటికి కనిపించని సూక్ష్మ ట్యూమర్లను కూడా పసిగడుతుంది.

ఆసుపత్రుల రియల్ టైం డేటా స్టార్టప్‌లకు అందుబాటులో ఉండటం వల్ల, వారు భారతీయ రోగుల కోసం ప్రత్యేకమైన యాప్‌లు, మెడికల్ డివైజ్‌లను అభివృద్ధి చేయగలరు.

వైద్యుల స్థానాన్ని భర్తీ చేస్తుందా?

చాలా మందిలో ఉన్న అపోహను GIMS డైరెక్టర్ బ్రిగేడియర్ డాక్టర్ రాకేష్ గుప్తా కొట్టిపారేశారు. AI సాంకేతికత వైద్యుల స్థానాన్ని భర్తీ చేయదు, కానీ వారికి ఒక ‘సూపర్ పవర్’ లాగా పనిచేస్తుంది. క్లినికల్ వర్క్‌ఫ్లోను సులభతరం చేయడం ద్వారా వైద్యులు అత్యవసర కేసులపై ఎక్కువ దృష్టి పెట్టేలా చేస్తుంది. రోగి భద్రత మరియు డేటా గోప్యత కోసం ప్రత్యేక పర్యవేక్షణ కమిటీ ప్రతిపాదనలను నిరంతరం తనిఖీ చేస్తుంది.

స్టార్టప్‌లకు, గ్రామీణ భారతాన్నకి వరప్రసాదం

ఈ క్లినిక్ ద్వారా హెల్త్-టెక్ స్టార్టప్‌లకు సరికొత్త అవకాశాలు లభిస్తాయి. IIT, NIT వంటి విద్యా సంస్థల సహకారంతో నూతన ఆవిష్కరణలు ఇక్కడ రూపుదిద్దుకోనున్నాయి. ముఖ్యంగా, వైద్య సేవలు తక్కువగా అందే గ్రామీణ ప్రాంతాల్లో సరైన నిర్ధారణ పరీక్షలను తక్కువ సమయంలో అందించడానికి ఈ AI వ్యవస్థలు దోహదపడతాయి.

సంప్రదాయ వైద్యానికి, ఆధునిక కృత్రిమ మేధస్సుకు వారధిగా నిలుస్తున్న ఈ ‘AI క్లినిక్’, భవిష్యత్తులో భారతీయ వైద్య రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించనుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.