తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి సినిమా కబుర్లతో కాదు, తన ఆరాధ్య దైవం పట్ల, తన అభిమాన నాయకుడి పట్ల ఉన్న అపారమైన భక్తితో ఆయన ఒక భారీ సాహసానికి పూనుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్షేమం కోరి తాను మొక్కుకున్న మొక్కును తీర్చుకునేందుకు బండ్ల గణేష్ రెడీ అవుతున్నారు. గతంలో స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయి జైలుకు వెళ్లిన సమయంలో, ఆయన అభిమానిగా బండ్ల గణేష్ తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఆ క్లిష్ట సమయంలో చంద్రబాబు నాయుడు ఎలాంటి మచ్చ లేకుండా, క్షేమంగా విడుదల అవ్వాలని ఆయన తిరుమల వేంకటేశ్వర స్వామిని వేడుకున్నారు. చంద్రబాబు నిర్దోషిగా బయటకు వస్తే, తన స్వగృహం నుంచి తిరుమల వరకు కాలినడకన వచ్చి మొక్కు చెల్లించుకుంటానని శ్రీవారికి మొక్కుకున్నారు.
నేరవేరిన కోరిక.. ప్రారంభం కానున్న యాత్ర :
ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలు, ఎన్నికల్లో ఘనవిజయం సాధించి చంద్రబాబు నాయుడు తిరిగి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించడంతో బండ్ల గణేష్ తన మొక్కును తీర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు జనవరి 19వ తేదీన రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోని తన నివాసం నుంచి ఈ మహా పాదయాత్రను ప్రారంభించనున్నారు.
పాదయాత్ర ప్రారంభ వేదిక షాద్‌నగర్‌లోని బండ్ల గణేష్ స్వగృహం కాగా, ఏడుకొండల వాడి సన్నిధి – తిరుమల.
సుమారు 500 కిలోమీటర్లకు పైగా దూరాన్ని గణేష్ కాలినడకన అధిగమించనున్నారు. పాదయాత్ర ప్రారంభం రోజున షాద్‌నగర్‌లో భారీ ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉంది.
బండ్ల గణేష్‌కి రాజకీయాల పట్ల, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు పట్ల ఉన్న అభిమానం జగమెరిగిన సత్యం. ఇప్పుడు సుమారు 350-400 కిలోమీటర్ల మేర సాగే ఈ కఠినమైన పాదయాత్రను ఆయన చేపట్టడం రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. “మాట ఇస్తే వెనక్కి తగ్గని నైజం నాది” అని చాటిచెప్తూ, తన భక్తిని చాటుకోవడానికి బండ్ల గణేష్ సిద్ధమవుతున్నారు.

































