ఇన్​స్టాగ్రామ్​ పాస్​వర్డ్​ మార్చమని మెయిల్​ వచ్చిందా? తస్మాత్​ జాగ్రత్త..

ఇన్‌స్టాగ్రామ్ ఖాతాదారుల వ్యక్తిగత సమాచారం డార్క్ వెబ్‌లో ప్రత్యక్షమైందన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. సుమారు 1.75 కోట్ల మంది యూజర్ల వివరాలు చోరీకి గురైనట్లు సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇన్​స్టాగ్రామ్​ పాస్​వర్డ్​ రీసెట్​ మెయిల్​ వెనుక ఈ డేటా బ్రీచ్​ ఉన్నట్టు తెలుస్తోంది.

ఇన్​స్టాగ్రామ్​ యూజర్లలో చాలా మందికి, తమ ప్రమేయం లేకుండానే ‘పాస్‌వర్డ్ రీసెట్’ చేయమని ఈమెయిల్స్ వస్తున్నాయి. మొదట్లో ఇదో సాంకేతిక లోపం అనుకున్నప్పటికీ, దీని వెనుక భారీ డేటా బ్రీచ్​ ఉందన్న వార్తలు ఇప్పుడు యూజర్లను భయాందోళనకు గురిచేస్తున్నాయి.


ఇన్​స్టాగ్రామ్​ పాస్​వర్డ్​ రీసెట్​ మెయిల్​- అసలేం జరిగింది?

ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థ ‘మాల్‌వేర్‌బైట్స్’ శనివారం ఒక సంచలన విషయాన్ని బయటపెట్టింది. మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టాగ్రామ్‌కు చెందిన సుమారు 1.75 కోట్ల మంది యూజర్ల సున్నితమైన సమాచారం హ్యాకర్ల చేతికి చిక్కిందని పేర్కొంది. ఇందులో యూజర్ల పేర్లు, ఫిజికల్ అడ్రెస్‌లు, ఫోన్ నంబర్లు, ఈమెయిల్ ఐడీలు ఉన్నాయని, ఈ డేటా ప్రస్తుతం డార్క్ వెబ్‌లో అమ్మకానికి ఉంచారని వెల్లడించింది.

డేటా బ్రీచ్ ట్రాకర్ ‘హ్యావ్ ఐ బీన్ పోన్డ్’ సృష్టికర్త ట్రాయ్ హంట్ కూడా తనకు ఇన్‌స్టాగ్రామ్ పాస్‌వర్డ్ రీసెట్ ఈమెయిల్ వచ్చినట్లు ధృవీకరించారు.

కాగా కొందరు సైబర్ పరిశోధకులు మరో వాదనను తెరపైకి తెచ్చారు. ప్రస్తుతం డార్క్ వెబ్‌లో తిరుగుతున్న డేటా కొత్తది కాదని, అది 2022 నాటిదని చెబుతున్నారు. 2024లో ఏపీఐ లీక్ ద్వారా బయటపడిన రికార్డులే ఇప్పుడు మళ్లీ సర్క్యులేట్ అవుతున్నాయని ‘ఇంటర్నేషనల్ సైబర్ డైజెస్ట్’ పేర్కొంది. కొందరైతే ఇది 2017 నాటి పాత సమాచారం కూడా అయి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. డేటా పాతదే కావొచ్చు కానీ, ఇప్పుడు అది బహిరంగం కావడం వల్ల హ్యాకర్లు దాన్ని వాడుకుని యూజర్లను బురిడీ కొట్టించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మెటా సమాధానం ఏంటి?

ఈ వార్తలపై మెటా ప్రతినిధి స్పందిస్తూ.. “కొంతమంది ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు పాస్‌వర్డ్ రీసెట్ ఈమెయిల్స్ వెళ్లేలా చేసిన ఒక సాంకేతిక సమస్యను మేము గుర్తించి, దాన్ని పరిష్కరించాము. మా సిస్టమ్స్ ఏవీ హ్యాక్ అవ్వలేదు, యూజర్ల అకౌంట్లు సురక్షితంగానే ఉన్నాయి. ఆ ఈమెయిల్స్‌ను పట్టించుకోవాల్సిన అవసరం లేదు,” అని వివరించారు.

అయితే 1.75 కోట్ల మంది డేటా లీక్ అయ్యిందన్న రిపోర్టులపై కంపెనీ నేరుగా ఎటువంటి బహిరంగ వ్యాఖ్య చేయలేదు.

ఇన్​స్టాగ్రామ్​ యూజర్లకు పొంచి ఉన్న ముప్పులేంటి?

పాస్‌వర్డ్స్ లీక్ అవ్వకపోయినా, ఈమెయిల్, ఫోన్ నంబర్లు హ్యాకర్ల దగ్గర ఉండటం వల్ల ‘సిమ్ స్వాపింగ్’ దాడులకు అవకాశం ఉంటుంది. అలాగే, హ్యాకర్లు ఇన్‌స్టాగ్రామ్ సపోర్ట్ టీమ్ లాగా నటిస్తూ మీకు ఫోన్ చేసి లేదా మెసేజ్ చేసి మీ అకౌంట్ లాగిన్ వివరాలు, టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ కోడ్స్ అడిగే ప్రమాదం ఉంది. దీన్నే ‘సోషల్ ఇంజనీరింగ్’ అంటారు.

ఇన్​స్టాగ్రామ్​ అకౌంట్​ సేఫ్టీ- మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్: మీ అకౌంట్‌కు వెంటనే 2ఎఫ్​ఏ ఆన్ చేసుకోండి. ఎస్ఎంఎస్ కంటే కూడా గూగుల్ అథెంటికేటర్ వంటి యాప్స్‌ను వాడటం ఇంకా సురక్షితం.

ఈమెయిల్స్ పట్ల జాగ్రత్త: మీరు కోరకుండానే వచ్చే పాస్‌వర్డ్ రీసెట్ ఈమెయిల్స్‌లోని లింక్స్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయకండి.

డేటా లీక్ చెక్ చేసుకోండి: మీ ఈమెయిల్ ఎప్పుడైనా డేటా చోరీకి గురైందో లేదో తెలుసుకోవడానికి ‘Have I Been Pwned’ లేదా మాల్‌వేర్‌బైట్స్ వారి డిజిటల్ ఫుట్‌ప్రింట్ స్కానర్ వెబ్‌సైట్లను వాడండి.

సాంకేతికత ఎంత పెరుగుతున్నా, మన జాగ్రత్తే మనకు శ్రీరామరక్ష అని గుర్తుపెట్టుకోండి. అపరిచిత ఈమెయిల్స్ విషయంలో ఎల్లప్పుడు అప్రమత్తంగా ఉండండి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.