తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి రద్దీ కొనసాగుతుంది. సంక్రాంతికి సెలవులు రావడంతో చాలామంది సొంత గ్రామాలకు ప్రయాణమయ్యారు. దీంతో బస్సులు, రైళ్లు కిటకిటలాడుతున్నాయి.
సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులకు ఉపశమనం కలిగించేలా ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే అనేక ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఇక తాజాగా దక్షిణ మధ్య రైల్వే రద్దీని దృష్టిలో పెట్టుకొని మరో కీలక నిర్ణయం ప్రకటించింది.
మరో మూడు అదనపు రైళ్ళు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య అనకాపల్లి, చర్లపల్లి మార్గంలో మరో మూడు అదనపు రైళ్లలో నడపడానికి నిర్ణయించింది. ముఖ్యంగా విజయవాడ, గుంటూరు నల్గొండ మీదుగా ప్రయాణం చేసే వారికి వారి ప్రయాణాన్ని సులభతరం చేసేలా దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. అదనపు రైళ్ల సేవలు ప్రయాణికులకు ఎంతో ప్రయోజనకరంగా ఉండనున్నాయి.
చర్లపల్లి అనకాపల్లి మార్గంలో ఈ తేదీలలో
దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రత్యేక రైళ్లు జనవరి 18, 19 తేదీలలో అందుబాటులో ఉంటాయి ట్రైన్ నెంబర్ 07471.. అనకాపల్లి చర్లపల్లి సర్వీస్ జనవరి 18న రాత్రి పదిన్నరకు అనకాపల్లిలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 11:30 కు చర్లపల్లి కి చేరుతుంది.
ఈ స్టేషన్ ల మీదుగా ప్రత్యేక రైళ్ళు
ట్రైన్ నెంబర్ 07472 చర్లపల్లి- అనకాపల్లి రైలు జనవరి 19వ తేదీ అర్ధరాత్రి 12:40కి చర్లపల్లి నుంచి బయలుదేరి అదే రోజు రాత్రి 9 గంటలకు అనకాపల్లికి చేరుతుంది. మరో అనకాపల్లి చర్లపల్లి రైలు జనవరి 19న రాత్రి పదిన్నరకు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 11:30గంటలకు గమ్యానికి చేరుకుంటుంది. ఈ రెండు రైళ్లు రెండు తెలుగు రాష్ట్రాలలోని రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, మిర్యాలగూడ, నల్గొండ వంటి కీలక స్టేషన్లలో ఆగుతాయి.
సాధారణ రైళ్లలో విపరీతమైన రద్దీపై రైల్వే అధికారుల సూచన
దూరప్రాంత ప్రయాణికుల సౌకర్యం కోసం వీటిలో ఏసీ, స్లీపర్, జనరల్ కోచ్ లు అందుబాటులో ఉంటాయని అధికారులు చెబుతున్నారు. పండుగ కారణంగా సాధారణ రైళ్లలో విపరీతమైన రద్దీ కొనసాగుతుంది. ఇప్పటికే రైళ్లలో వెయిటింగ్ లిస్టులు పెరిగిపోయాయి. ఇక ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తే అవి కూడా నిండే పరిస్థితి కనిపిస్తుంది. కనుక ప్రయాణికులు ప్రయాణాలు చేయాలనుకుంటే ముందస్తుగానే రిజర్వేషన్ చేసుకోవాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు.



































