“మందుబాబు” లకు సంక్రాంతి పండుగ సెలబ్రేషన్స్ కష్టమేనా..?

తెలుగు వారి అతిపెద్ద పండుగ “సంక్రాంతి” శోభ మొదలైంది. ఏపీ, తెలంగాణల్లో ఈ పండుగను మూడు నుంచి నాలుగు రోజుల పాటు అత్యంత వైభవంగా జరుపుకుంటారు.


రైతులు పండించిన పంట ఇంటికి వచ్చే సమయం కాబట్టి దీనిని “రైతు పండుగ”గా కూడా పిలుస్తారు. అందుకే ఎక్కడెక్కడ ఉన్నవారు కూడా.. సంక్రాంతి సమయానికి సొంతూళ్లకు చేరుకుంటారు. సంక్రాంతి పండుగ అంటే ముఖ్యంగా గుర్తొచ్చేది.. కొత్త బట్టలు, పిండివంటలు, గాలిపటాలు, ముగ్గులు, ఘాటైన ఘుమఘుమలతో వంటకాలు, కోడి పందాలు. వీటితో పాటు మందు బాబుల హడావిడి కూడా షరా మామూలే. కానీ ఈ పండుగ సమయంలో ఏపీలో మద్యం ప్రియులకు బిగ్ షాక్ తగిలింది.

ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మద్యం ధరలను పెంచుతూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా లిక్కర్ ధరలు పెరిగాయి. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం రూ.99 ఎంఆర్‌పీ ఉన్న మద్యం బాటిళ్లను మినహాయించి మిగిలిన అన్ని రకాల మద్యం ఉత్పత్తులపై ఒక్కో బాటిల్‌కు రూ.10 చొప్పున ధర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో IMFL, FL, బీర్, వైన్ వంటి అన్ని విభాగాల మద్యం ఉత్పత్తులు ఉన్నాయి. రూ.99 ధర ఉన్న బీర్, వైన్ బాటిళ్లకు మాత్రం ఈ పెంపు వర్తించదని సర్కారు స్పష్టం చేసింది.

అంతే కాకుండా ఇదే సమయంలో మద్యం విక్రయాల్లో రిటైలర్లకు ఇచ్చే మార్జిన్‌ను కూడా ప్రభుత్వం స్వల్పంగా పెంచింది. IMFL, FLతో పాటు రూ.99 ఎంఆర్‌పీ ఉన్న బీర్, వైన్ బాటిళ్లపై రిటైలర్ మార్జిన్‌ను 1 శాతం పెంచాలని నిర్ణయించింది. మద్యం ధరలు పెంచడం ద్వారా ప్రభుత్వానికి ఏటా సుమారు రూ.1,391 కోట్ల అదనపు ఆదాయం లభిస్తుందని అంచనా వేస్తున్నారు. దీంతో సంక్రాంతి సమయంలో.. మద్యం ధరలు పెంచడం ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇక బార్లు మరియు మద్యం షాపుల్లో ఒకే రకమైన మద్యం ఉత్పత్తులకు వేర్వేరు ధరలు ఉండటంతో వినియోగదారుల్లో అయోమయం ఏర్పడుతోంది. ఈ అసమానతను తొలగించేందుకు ప్రభుత్వం అదనపు రిటైల్ ఎక్సైజ్ పన్నును ఉపసంహరించాలని నిర్ణయించింది. దీంతో బార్లు, షాపుల్లో ధరలు సమానంగా ఉండే అవకాశం ఉంది. ధరల పెంపుతో మద్యం ప్రియులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.