రెండు తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు బెంబేలెత్తిస్తోన్నాయి. గతంలో కర్నూలు వద్ద సంభవించిన కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో 42 మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు.
చేవెళ్ల వద్ద టీజీఎస్ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీ కొట్టిన ఘటనలో 18 మంది దుర్మరణం పాలయ్యారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ఘటనలో పలువురు దుర్మరణం పాలయ్యారు. సురక్షితంగా గమ్యస్థానం చేరుతామనే గ్యారంటీ ప్రయాణికులకు లేకుండా పోయింది.
ఇప్పుడు తాజాగా జడ్చర్ల వద్ద మరో టీజీఎస్ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ నుంచి కర్నూలుకు బయలుదేరిన బస్సు అది. ఆ సమయంలో బస్సులో దాదాపు 30 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. వారందరూ కూడా సంక్రాంతి పండగ కోసం తమ స్వస్థలాలకు వెళ్తోన్నారు. వేకువ జామున 1:45 గంటల సమయంలో జడ్చర్ల సమీపంలోని మాచారం వద్ద జాతీయ రహదారిపై ప్రమాదానికి గురైంది. ముందు వెళ్తోన్న డీసీఎం వాహనాన్ని వేగంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముందు వరసలో కూర్చున్న ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి.


































