సెర్చ్​ చేయకుండానే స్టిక్కర్లు పంపొచ్చు! వాట్సాప్​లో కొత్త ఫీచర్​..

వాట్సాప్ తన వినియోగదారుల కోసం సరికొత్త ‘స్టిక్కర్ సజెషన్’ ఫీచర్‌ను తీసుకువస్తోంది. దీనివల్ల చాటింగ్ మరింత వేగంగా, సరదాగా మారనుంది. అలాగే ఏపీ మెడికల్ కౌన్సిల్ కూడా డాక్టర్ల కోసం వాట్సాప్ ఏఐ సేవలను ప్రారంభించింది.

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్ల కోసం చాటింగ్‌ను మరింత సులభతరం చేసే పనిలో పడింది. మనం మెసేజ్ టైప్ చేస్తున్నప్పుడే దానికి తగిన స్టిక్కర్లను వాట్సాప్ స్వయంగా సూచించే సరికొత్త ఫీచర్‌ను సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ఆండ్రాయిడ్ బీటా యూజర్లకు అందుబాటులో ఉన్న ఈ ఫీచర్.. తాజాగా ఐఓఎస్ బీటా వెర్షన్‌లోనూ ప్రత్యక్షమైంది. త్వరలోనే ఇది అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.


దీనిని స్టిక్కర్ సజెషన్ ఫీచర్‌ అని పిలుస్తున్నట్టు తెలుస్తోంది.

సాధారణంగా మనం వాట్సాప్​లో ఎవరికైనా స్టిక్కర్ పంపాలంటే.. ముందుగా స్టిక్కర్ ట్రే ఓపెన్ చేసి, మనకు నచ్చిన దాని కోసం వెతకాల్సి వచ్చేది. కానీ ఈ కొత్త అప్‌డేట్‌తో ఆ శ్రమ తప్పుతుంది! స్నాప్‌చాట్‌లో ఉన్న తరహాలోనే, మీరు వాట్సాప్​లో మెసేజ్ బార్‌లో టైప్ చేస్తున్నప్పుడే సందర్భానికి తగ్గ స్టిక్కర్లు పైన కనిపిస్తాయి.

ఈ వాట్సాప్​ కొత్త ఫీచర్ ఎలా పనిచేస్తుంది?

బీటా టెస్టింగ్ నివేదికల ప్రకారం.. మీరు చాట్ చేస్తున్నప్పుడు ఏదైనా ఒక ఎమోజీని టైప్ చేస్తే, దానికి సరిపోయే స్టిక్కర్లు ఏవైనా ఉన్నాయా అని వాట్సాప్ వెతుకుతుంది. ఒకవేళ ఉంటే, వెంటనే ఆ స్టిక్కర్ ఆప్షన్ టెక్ట్స్​ బార్ దగ్గర కనిపిస్తుంది. మీరు కేవలం ఒక్క క్లిక్‌తో ఆ స్టిక్కర్‌ను అవతలి వారికి పంపవచ్చు.

మాటల్లో చెప్పలేని భావాలను స్టిక్కర్ల ద్వారా పంపే వారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

ప్రస్తుతం ఇది కొద్దిమంది బీటా వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది.

ఏపీ మెడికల్ కౌన్సిల్ సరికొత్త చొరవ..

మరో ముఖ్యమైన వార్త ఏంటంటే.. ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ (ఏపీఎంసీ) డాక్టర్ల కోసం వాట్సాప్ వేదికగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సేవలను ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైద్యులు కౌన్సిల్ సేవలను సులభంగా పొందేలా ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇకపై డాక్టర్లు రిజిస్ట్రేషన్లు, రెన్యూవల్స్, క్రెడిట్ పాయింట్లు, అపాయింట్‌మెంట్ బుకింగ్‌ల సమాచారం కోసం విజయవాడలోని కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. కేవలం 9030999616 అనే వాట్సాప్ నంబర్‌కు మెసేజ్ చేయడం ద్వారా పూర్తి సమాచారాన్ని పొందవచ్చు. వైద్యులకు మార్గదర్శకత్వం చేసేందుకు చిన్న సందేశాలు మరియు వీడియోలను కూడా ఈ ఏఐ సిస్టమ్ ద్వారా అందుబాటులో ఉంచారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.