నేడు బ్యాంక్‌ యూనియన్ల సమ్మె

ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. ఐదు రోజుల పనిదినాలను వెంట నే అమల్లోకి తీసుకురావాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం దేశవ్యాప్తంగా సమ్మె చేస్తున్నట్టు యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాం కింగ్‌ యూనియన్లు(యూఎఫ్‌బీయూ) ప్రకటించింది.


దేశవ్యాప్తంగా బ్యాంకింగ్‌ కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోనున్నాయి. దీంతో వరుసగా నాలుగు రోజులు బ్యాంకులు మూసివేసివుంచనున్నారు.

ఈ నెల 24న నాలుగో శనివారం, 25న ఆదివారం, 26న గణతంత్ర దినోత్సవం, 27న ఉద్యోగులు సమ్మె చేయనుండటంతో వరుసగా నాలుగు రోజులు సెలవులు వచ్చాయి. వారానికి ఐదు రోజుల పనిదినాలను వెంటనే అమల్లోకి తీసుకురావాలనే డిమాండ్‌పై ప్రభుత్వ వర్గాలతో చర్చించినప్పటికీ ఎలాంటి హామీ రాలేదని, దీంతో సమ్మె చేయాలని నిర్ణయించినట్టు ఆల్‌ ఇండియా బ్యాంక్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ సీహెచ్‌ వెంకటాచలం తెలిపారు.

దీనిపై రెండేండ్ల క్రితం జరిగిన చర్చల్లో కేంద్ర సర్కార్‌ హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు అమలు చేయలేదని, సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజుకు అదనంగా 40 నిమిషాలు పనిచేస్తామని హామీ ఇచ్చినప్పటికీ సర్కార్‌ పెడచెవిన పెడుతున్నదన్నారు. ఉద్యోగుల సమ్మె చేయనుండటంతో నగదు డిపాజిట్లు, విత్‌డ్రాలు, చెక్‌ క్లియరెన్స్‌లు నిలిచిపోనున్నాయి. ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ దిగ్గజ సంస్థలైన ఎస్బీఐ, పీఎన్‌బీ, బీవోబీ, యూనియన్‌ బ్యాంక్‌, ఇతర బ్యాంకులు తమ ఖాతాదారులకు ఈ సమాచారాన్ని చేరవేశాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.