ఆంధ్రప్రదేశ్‌లో సహకార కేంద్ర బ్యాంకుల్లో యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఈ సేవలతో రైతులు కూడా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చెల్లింపులు చేయవచ్చు. ఇదివరకు వాణిజ్య బ్యాంకుల్లో మాత్రమే ఉన్న ఈ సౌకర్యం ఇప్పుడు సహకార బ్యాంకు ఖాతాదారులకు కూడా లభించనుంది. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని సహకార బ్యాంకుల్లోనూ ఈ సేవలు విస్తరించనున్నాయి.
దేశవ్యాప్తంగా యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చాయి. క్యూఆర్ కోడ్ స్కాన్‌తో చెల్లింపులు, ఫోన్ పే, గూగుల్ పే వంటి యూపీఐ సేవల్ని ప్రజలు ఉపయోగిస్తున్నారు. కానీ ఇప్పటికీ కొన్ని బ్యాంకుల్లో ఈ సేవలు అందుబాటులోకి రాలేదు.. అయితే ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా మరికొన్ని బ్యాంకులు కొత్తగా యూపీఐ సేవల్ని అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల్లో (డీసీసీబీ) యూపీఐ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ప్రయోగాత్మకంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని సహకార బ్యాంకుల్లో ఈ సేవలను రిపబ్లిక్ డే రోజు ప్రారంభించారు. దీనివల్ల సహకార బ్యాంకుల్లో అకౌంట్‌లు ఉన్న రైతులకు కూడా ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇకపై అన్నదాతలు కూడా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చెల్లింపులు చేయడం, ఫోన్ పే, గూగుల్ పే వంటి యూపీఐ సేవలను ఉపయోగించుకోవచ్చు.
మొన్నటి వరకు యూపీఐ సేవలు కేవలం వాణిజ్య బ్యాంకుల్లో అకౌంట్‌లు ఉన్నవారికి వారికి మాత్రమే పరిమితమయ్యాయి. దీనివల్ల సహకార బ్యాంకుల్లో అకౌంట్‌లు ఉన్న రైతులు కొన్ని పంటల్ని అమ్మకాలకు సంబంధించిన లావాదేవీల కోసం వాణిజ్య బ్యాంకుల వైపు మొగ్గు చూపాల్సి వచ్చేది. అయితే రైతులు అలా వాణిజ్య బ్యాంకుల వైపు వెళ్లకుండా.. సహకార బ్యాంకుల్లోనూ యూపీఐ సేవలను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఆప్కాబ్ ఛైర్మన్ గన్ని వీరాంజనేయులు యూపీఐ సేవల అంశంపై ఉన్నతాధికారులతో చర్చించారు.. ముందుగా తన సొంత జిల్లా అయిన ఉమ్మడి పశ్చిమగోదావరి నుంచే ఈ ప్రయోగాన్ని మొదలుపెట్టారు.
వాణిజ్య బ్యాంకుల్లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ సేవలను సహకార బ్యాంకుల్లోనూ ప్రవేశపెట్టడంతో.. రైతులు ఆన్‌లైన్ లావాదేవీలకు ప్రాధాన్యతనిచ్చేలా ప్రోత్సహిస్తోంది. ఆప్కాబ్ ఛైర్మన్ గన్ని వీరాంజనేయులు చొరవతో ఈ కార్యక్రమం మొదలైంది. అంతేకాదు కూటమి ప్రభుత్వం సహకార సంఘాలు, బ్యాంకుల్లో పారదర్శకత పెంచడానికి లావాదేవీలను కంప్యూటరీకరించింది. ఈ కంప్యూటరీకరణ వల్లనే ఆన్‌లైన్ సేవలను అమలు చేయడానికి లైన్ క్లియర్ అయ్యింది. ఇకపై సహకార బ్యాంకు ఖాతాదారులు తమ మొబైల్ ఫోన్లను ఉపయోగించి ఎప్పుడైనా.. ఎక్కడి నుంచైనా బ్రాంచిని సందర్శించకుండానే నగదురహిత లావాదేవీలను చేయొచ్చు. ఈ నగదు రహిత సేవలు రైతులకు ఎంతో ఉపయోగంగా ఉన్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని సహకార బ్యాంకుల్లోనూ త్వరలోనే యూపీఐ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. దీనివల్ల లక్షలాది మంది రైతులు డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో భాగస్వాములు కానున్నారు. ఇది వ్యవసాయ రంగంలో ఆర్థిక లావాదేవీలను మరింత సులభతరం చేస్తుందని చెబుతున్నారు. మొత్తం మీద సహకార బ్యాంకుల్లో ‘యూపీఐ’ సేవలు అందుబాటులోకి వస్తుండటంతో రైతులు కూడా ఆనందంలో ఉన్నారు.


































