ఏపీ ఉచిత బస్సు ప్రయాణాలు, ఆర్టీసీ ఆదాయంతో పాటు బోలెడు శుభవార్తలు చెప్పిన మంత్రి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలులోకి వచ్చిన నాటి నుండి ఏపీఎస్ఆర్టీసీ ఆదాయంలో గణనీయమైన మార్పులు వచ్చాయి. ఇక ఏపీలో అమలవుతున్న స్త్రీ శక్తి పథకంతో పాటు, ఆర్టీసీ కార్గో సర్వీసుల గురించి రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆసక్తికర వివరాలను వెల్లడించారు.

స్త్రీశక్తి పథకంతో 40 కోట్ల ఉచిత ప్రయాణాలు


విజయవాడలోని ఆర్టీసీ కార్యాలయంలో ఎండి ద్వారక తిరుమల రావు తో కలిసి స్త్రీ శక్తి పథకం అమలు పైన సమీక్ష చేసిన మంత్రి, ఏపీఎస్ఆర్టీసీ సాధిస్తున్న కార్గో ఆదాయం పైన కూడా ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్త్రీ శక్తి పథకం కింద మహిళలు సుమారు 40 కోట్ల ఉచిత ప్రయాణాలు చేశారని ఆయన పేర్కొన్నారు. మహిళల కోసం అందిస్తున్న ఈ పథకాన్ని ప్రభుత్వం భారం అనుకోకుండా బాధ్యతగా అమలు చేస్తుందని మంత్రి మండిపల్లి పేర్కొన్నారు.

కార్గో సర్వీసుల ద్వారా కూడా 200 కోట్ల రూపాయల ఆదాయం

ఈ పథకం విజయవంతం కావడానికి 48 వేల మంది ఆర్టీసీ సిబ్బంది కృషి చేస్తున్నారని, వారందరి కృషిని మంత్రి కొనియాడారు. ఏపీ ఆర్టీసీ కేవలం టికెట్ల ఆదాయం పైనే ఆధారపడకుండా కార్గో సర్వీసుల ద్వారా కూడా 200 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించింది అని మంత్రి అన్నారు. రాష్ట్రంలో కార్గో ఆదాయంలో ముందున్న జిల్లా అధికారులకు మంత్రి ప్రశంసా పత్రాలను, నగదు పురస్కారాలను అందించారు.

త్వరలో రాష్ట్రానికి 750 ఎలక్ట్రిక్ బస్సులు

విజయవాడ బస్టాండ్ లోని కొత్త కార్గో సర్వీస్ భవనాన్ని ప్రారంభించిన ఆయన ఈ సందర్భంగా మరో ముఖ్యమైన ప్రకటన కూడా చేశారు. త్వరలో రాష్ట్రానికి 750 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయని, రెట్రో ఫిట్మెంట్ బస్సుల పైన పరిశీలన సాగుతోందని ఆయన అన్నారు. రాష్ట్రంలో అధునాతన సౌకర్యాలతో ఉండే ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురాబోతున్నామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.

పల్లె వెలుగు సర్వీసులలోనూ ఏసీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పల్లె వెలుగు సర్వీసులలో కూడా ఏసి ఉండేలా తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని, ఆ మేరకు అన్ని చర్యలను తీసుకుంటున్నామని మంత్రి మండిపల్లి తెలిపారు. ఏపీలో మహిళలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రయాణాలు చేసేందుకు వీలుగా అన్ని ప్రాంతాలలోను ఏసీ బస్సులను అందుబాటులోకి తీసుకువస్తామని రవాణా శాఖ మంత్రి పేర్కొన్నారు.

ప్రయాణికులకు సురక్షిత ప్రయాణం

గతంలో వైసిపి ప్రభుత్వంలో పరిష్కారం కాని ఎన్నో రవాణా పరమైన సమస్యలకు ప్రస్తుతం తమ ప్రభుత్వంలో పరిష్కారం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఆర్టీసీ విషయంలో ఏపీ ప్రభుత్వం ప్రయాణికుల సురక్షిత ప్రయాణం కోసం తమ వంతుగా చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.