ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తన ఫోన్ కెమెరాలకు ఎరుపు రంగు స్టిక్కర్(రెడ్ టేప్) అంటించడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
జెరూసలేంలోని ఇజ్రాయెల్ పార్లమెంట్ (నెస్సెట్) అండర్‌గ్రౌండ్ పార్కింగ్‌లో ఆయన ఫోన్ మాట్లాడుతున్న ఫోటోలు వైరల్ కావడంతో అసలు ఆయన తన ఫోన్ కెమెరాను ఎందుకు మూసివేశారనే చర్చ మొదలైంది.
నెతన్యాహు తన ఫోన్ కెమెరాకు స్టిక్కర్ ఎందుకు అంటించారు?
ప్రముఖ పాడ్‌కాస్టర్ మారియో నౌఫల్ ఈ ఫోటోలను గమనించి.. “నెతన్యాహు తన ఫోన్ కెమెరాకు టేప్ ఎందుకు వేశారు? ఆయన ఎవరి గురించి భయపడుతున్నారు?” అని ప్రశ్నించారు. ఒక దేశ ప్రధానికే ఇంత భద్రత అవసరమైతే, సామాన్యుల పరిస్థితి ఏంటనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.
అది మామూలు స్టిక్కర్ కాదండోయ్!
అమెరికన్ వార్తా సంస్థ ‘హైప్‌ఫ్రెష్’ కథనం ప్రకారం.. స్మార్ట్ ఫోన్లు, సెన్సార్లపై రెడ్ టేప్ అతికించడం ఒక కామన్ సెక్యూరిటీ ప్లాన్. నెతన్యాహు ఫోన్‌పై ఉన్న ఆ ఎరుపు రంగు స్టిక్కర్ యాదృచ్ఛికంగా అంటించింది కాదు. అది ఒక ‘టాంపర్-ఎవిడెంట్ సీల్’. అత్యంత భద్రత ఉండే ప్రాంతాల్లో ఇలాంటి ప్రత్యేక స్టిక్కర్లను ఉపయోగిస్తారు. ఇది కెమెరాను పూర్తిగా కప్పివేయడం వల్ల, ఎవరూ అనుకోకుండా లేదా కావాలని రహస్య సమాచారాన్ని ఫోటోలు తీయడానికి వీలుండదు. ఫోన్ కెమెరాలకు స్టిక్కర్ తీసేస్తే.. సున్నిత ప్రాంతాలను రికార్డు చేసే ప్రమాదం ఉంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా హై సెక్యూరిటీ జోన్లలో నో ఫోటోగ్రఫీ రూల్స్ అమలు చేస్తారు. అయితే ఇజ్రాయెల్ ప్రధాని ఇలా కనిపించడం ఇదే మొదటి సారి కాదట. గతంలోనూ నెతన్యాహు ఫోన్లకు స్టిక్కర్లు కనిపించాయి. ఇది ఒక స్టాండర్డ్ ప్రోటోకాల్ అని.. వారికి ఇది సాధారణమని తెలుస్తోంది.
రహస్యాల లీకేజీకి అడ్డుకట్ట
ప్రభుత్వ కార్యాలయాలు, ముఖ్యంగా ఇజ్రాయెల్ పార్లమెంట్‌లోని క్లాసిఫైడ్ జోన్లలో ఫోటోలు తీయడం నిషిద్ధం. స్మార్ట్‌ఫోన్‌లలో ఉండే కెమెరాలు, మైక్రోఫోన్లు, ఇతర సెన్సార్ల ద్వారా రహస్య సమాచారాన్ని రికార్డ్ చేసే లేదా హ్యాక్ చేసే అవకాశం ఉంది. అందుకే గూఢచర్యాన్ని అడ్డుకోవడానికి, భద్రతా కారణాల దృష్ట్యా ఈ స్టిక్కర్లను ఉపయోగిస్తారు.
గూఢచర్య భయాలు
జాతీయ భద్రత దృష్ట్యా ఇజ్రాయెల్ కొన్ని రకాల స్మార్ట్‌ఫోన్లు, టిక్‌టాక్ వంటి యాప్‌ల వాడకంపై కఠినమైన నిబంధనలను విధిస్తుంది. ఇజ్రాయెల్‌కు చెందిన ‘పెగాసస్’సాఫ్ట్‌వేర్ ప్రపంచవ్యాప్తంగా రాజకీయ నాయకులు, జర్నలిస్టులపై గూఢచర్యం చేయడానికి వాడారనే ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. సొంత దేశంలోనే ఇజ్రాయెల్ పోలీసులు గతంలో ఎటువంటి వారెంట్లు లేకుండా పౌరులపై నిఘా పెట్టారనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రధాని స్థాయి వ్యక్తి తన డిజిటల్ భద్రత విషయంలో ఇంత కఠినంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది.

































