Janasena: గ్లాసు గుర్తును పోలిన బకెట్‌.. జనసేనపై ప్రభావం ఎంత..

www.mannamweb.com


జనసేన పార్టీలో బకెట్‌ సింబల్‌ చిచ్చు రేపుతోంది. గాజు గ్లాసును పోలి ఉండటంతో ఆ పార్టీకి నిద్రపట్టనివ్వడం లేదంటున్నారు కొందరు పరిశీలకులు. అంతేకాదు.. జనసేన అభ్యర్థుల పేర్లతోనే బకెట్ గుర్తు అభ్యర్థులు కూడా బరిలో ఉండటం ఆ పార్టీని ఆందోళనకు గురిచేస్తోంది. ఏపీలో ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరింది. ఒక వైపు సీఎం జగన్ మేమంతా సిద్దం అంటూ జిల్లాల వారిగా బస్సు యాత్రలు చేస్తున్నారు. ఇదే తరుణంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం పర్యటన తరువాత చంద్రబాబుతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. ప్రజాగళం పేరుతో తణుకు రోడ్ షోలో పాల్గొన్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో తమ సామాజిక వర్గ ఓటర్లను ఆకర్షించేందుకు కలిసి ప్రచారం చేస్తున్నారు ఇరుపార్టీల అధ్యక్షులు. అయితే ఇలాంటి నేపథ్యంలో కొత్త ట్విస్ట్ తెరపైకి వచ్చింది. తమను ఎన్నికల్లో పోటీ చేయొద్దంటూ జనసేన బెదిరిస్తోందని నవరంగ్ పార్టీ చీఫ్‌ జలీల్‌ ఆరోపించారు.

ఎలక్షన్స్‌ అంటే ప్రధాన పార్టీలకు చుక్కలు చూపిస్తుంటాయి చిన్న పార్టీలు. ఎందుకంటే తమ పార్టీ అభ్యర్థుల పేర్లతో బరిలో దిగుతారన్న దిగులు ఓవైపు. అంతకంటే పెద్ద తలనొప్పి ఏంటంటే తమ పార్టీ గుర్తుని పోలిన గుర్తులేమైనా వస్తాయేమోనన్న భయం ఇంకోవైపు. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు అలాంటి చిక్కే వచ్చిపడింది. జనసేన పొలిటికల్‌ స్టోరీలోకి నవరంగ్‌ కాంగ్రెస్‌ అనే ఓ సీజనల్‌ పార్టీ తేరంగేట్రం చేసింది. ఇది ప్రస్తుతం జనసేనకు నిద్రలేకుండా చేస్తోంది. ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు లేని పార్టీలకు ప్రకటించిన గుర్తుల్లో.. నవరంగ్‌ కాంగ్రెస్‌కు బకెట్‌ గుర్తు లభించింది. దీంతో ఆ పార్టీ పండగచేసుకుంటుంటే.. అదే సమయంలో గాజుగ్లాసు గుర్తును సంపాదించుకున్న జనసేన నేతలు మాత్రం తలలు పట్టుకుంటున్నారు. తమ గుర్తును పోలిఉన్న బకెట్‌తో పెద్ద థ్రెట్‌ ఉందని భావిస్తున్నారు. అంతేకాదు.. నవరంగ్‌ పార్టీ ప్రకటించిన అభ్యర్థుల పేర్లు కూడా జనసేన అభ్యర్థులతో మ్యాచ్‌ అవుతున్నాయి.

పిఠాపురంలో బకెట్ గుర్తు అభ్యర్థి కె.పవన్‌కల్యాణ్‌, తెనాలిలో బకెట్ గుర్తు అభ్యర్థి ఎన్‌.మనోహర్‌, మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా బాలశౌరిని నిలబెట్టామంటున్నారు నవరంగ్‌ కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌ జలీల్‌ఖాన్‌. అవి యాధృచ్చికంగా వచ్చాయని చెబుతున్నారాయన. ఇందులో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని తెలిపారు. మరోవైపు నవరంగ్‌ పార్టీ చీఫ్‌ను పిలిపించి మాట్లాడిన జనసేన నేత బాలశౌరి.. ఆయన దగ్గరున్న బీఫామ్స్‌ మొత్తం తీసుకుపోయారన్న ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. బాలశౌరి తన తలపై గన్ను గురిపెట్టి.. బెదిరించి.. బీఫామ్స్‌ మొత్తం కాజేశారంటున్నారు. ఏదైనా ఉంటే చర్చల ద్వారా తేల్చుకోవాలి గాని.. బెదిరించడం దారుణమంటున్నారు. గతంలో తెలంగాణలో బీఆర్ఎస్‎కు కూడా ఇలాంటి కష్టాలు వచ్చాయి. కారు గుర్తుని పోలిఉన్న రోడ్డురోలర్‌, చపాతీ కర్ర, ఆటోరిక్షా, ఇస్త్రీపెట్టె, ట్రక్కు గుర్తులు చాలా ఇబ్బంది పెట్టాయి. ఇప్పుడు జనసేన వంతు వచ్చింది. మరి నవరంగ్‌ పార్టీ అధ్యక్షుడి డిమాండ్లకు తలొగ్గుతారో.. లేదో.. చూడాలి.