ఆర్థిక నిపుణుల విశ్లేషణ ప్రకారం, ఈసారి బడ్జెట్‌లో పన్ను చెల్లింపుదారులకు ఊరటనిచ్చే ప్రధాన అంశాలు ఇవే:
1. పాత పన్ను విధానంలో మార్పులు
కొత్త పన్ను విధానాన్ని ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం, ఈసారి పాత పన్ను విధానం (Old Tax Regime) ఎంచుకున్న వారికి కూడా స్లాబ్‌లలో మార్పులు చేసి లబ్ధి చేకూర్చే అవకాశం ఉంది.
2. గృహ రుణ వడ్డీ మినహాయింపు పెంపు
సొంత ఇంటి కల కంటున్న వారికి ఇది శుభవార్త. ప్రస్తుతం సెక్షన్ 24B కింద ఉన్న రూ. 2 లక్షల వడ్డీ మినహాయింపును ఏకంగా రూ. 4 లక్షలకు పెంచే యోచనలో ప్రభుత్వం ఉంది.
3. ‘అఫర్డబుల్ హౌసింగ్’ పరిమితి సవరణ
మెట్రో నగరాల్లో ఇళ్ల ధరలు పెరగడంతో, రూ. 45 లక్షల వరకు ఉన్న ఇంటి విలువను (Affordable Housing) రూ. 75 లక్షల వరకు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనివల్ల ఎక్కువ మందికి వడ్డీ రాయితీలు అందుతాయి.
4. LTCG పన్ను పరిమితి పెంపు
మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు ఊరటనిస్తూ.. దీర్ఘకాలిక మూలధన లాభాల (LTCG) పన్ను రహిత పరిమితిని రూ. 1.25 లక్షల నుండి రూ. 1.5 లక్షలకు పెంచే అవకాశం ఉంది.
5. భార్యాభర్తలకు ఉమ్మడి పన్ను (Joint Taxation)
అమెరికా, యూరప్ దేశాల్లో ఉన్నట్లుగా, ఉద్యోగం చేసే భార్యాభర్తలకు కలిపి ‘జాయింట్ టాక్సేషన్’ విధానాన్ని ప్రవేశపెట్టాలని ICAI సిఫార్సు చేసింది. దీనివల్ల ఫ్యామిలీ టాక్స్ భారం తగ్గుతుంది.
6. బీమా ప్రీమియంలపై రాయితీ
ప్రస్తుతం కొత్త పన్ను విధానంలో బీమా ప్రీమియంలపై మినహాయింపులు లేవు. ఈసారి కొత్త పాలసీని మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలపై పన్ను రాయితీ ఇవ్వవచ్చు.
7. TDS రేట్ల సరళీకరణ
ప్రస్తుతం ఉన్న అనేక రకాల TDS రేట్లను కుదించి, కేవలం రెండు లేదా మూడు కేటగిరీలుగా మార్చడం ద్వారా గందరగోళాన్ని తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది.
8. EV రుణాలపై వడ్డీ తగ్గింపు
కాలుష్య నివారణే లక్ష్యంగా ఎలక్ట్రిక్ వాహనాల (EV) కొనుగోలును ప్రోత్సహించడానికి, వాటి రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించే ప్రకటన వెలువడే ఛాన్స్ ఉంది.
9. డెట్ ఫండ్ పన్ను నియమాల సడలింపు
గత బడ్జెట్‌లో కఠినతరం చేసిన డెట్ ఫండ్ పన్ను నిబంధనలను సడలించి, మదుపర్లను తిరిగి ఆకర్షించేలా మార్పులు చేయవచ్చు.
10. స్టాండర్డ్ డిడక్షన్ పెంపు
జీతభత్యాల వర్గానికి ఊరటనిస్తూ స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని కూడా పెంచే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.



































