మునగకాయలు, మునగ ఆకుల్లో అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా మునగాకు తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి.. ఇవి జీవక్రియను పెంచుతాయి.. ఇంకా శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తాయి.. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో మునగ ఆకు నీటిని లేదా రసం తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ తొలగిపోతాయి. జుట్టు రాలడం, రక్తహీనత, కీళ్లనొప్పులు, థైరాయిడ్, ఉబ్బసం, బలహీనమైన రోగనిరోధక శక్తి, మధుమేహం, బరువు తగ్గడం వంటి వ్యాధులకు మునగ ఆకులు ఉపయోగపడతాయని ఆయుర్వేదంలో పేర్కొన్నారు. మునగాకు రసం, లేదా నీటిని తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకోండి..
మునగ చెట్టును ఆయుర్వేదంలో ఔషధ మొక్కగా పరిగణిస్తారు. ఇది అనేక వ్యాధుల చికిత్సలో ఉపయోగించబడుతుంది. ఇందులో క్యారెట్ కంటే 10 రెట్లు ఎక్కువ విటమిన్ ఎ ఉంటుంది. పాల కంటే 17 రెట్లు ఎక్కువ కాల్షియం, నారింజ కంటే ఏడు రెట్లు ఎక్కువ విటమిన్ సి, అరటిపండ్ల కంటే 15 రెట్లు ఎక్కువ పొటాషియం, పెరుగు కంటే 25 రెట్లు ఎక్కువ ఐరన్, 9 రెట్లు ఎక్కువ ప్రొటీన్లను కలిగి ఉంటుంది.
మునగాకును తీసుకోవడం వల్ల తల్లులలో తల్లి పాల ఉత్పత్తి పెరుగుతుంది. ఆర్థరైటిస్ వంటి మస్క్యులోస్కెలెటల్ నొప్పి నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. ఇది శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉంటుంది.. శరీరంలోని వాపును తగ్గిస్తుంది. ఇందులోని పాలీఫినాల్స్, ఫ్లేవనాయిడ్స్ నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తాయి.
క్యాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలకు బలం చేకూరుతుంది. మునగాకు నీరు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది అనేక వ్యాధుల నుండి రక్షిస్తుంది. మునగాకు రసంలో యాంటీఆక్సిడెంట్లు, ఖనిజాలు, విటమిన్లు A, C, E, కాల్షియం, పొటాషియం, బీటా కెరోటిన్ పుష్కలంగా ఉన్నాయి. ఇది అనేక ఇన్ఫెక్షన్ల నుండి దూరంగా ఉంచుతుంది.
మునగాకు హిమోగ్లోబిన్‌ను పెంచడానికి సహాయపడుతుంది. మీరు త్వరగా బరువు తగ్గాలనుకుంటే మునగాకు నీరు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు మునగాకు నీరు చాలా మేలు చేస్తుంది. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడమే కాకుండా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. ఉదయాన్నే పరగడుపున పచ్చి ఆకులతో కూడిన నీటిని తీసుకుంటే మధుమేహం వచ్చే ప్రమాదం తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)