నైరుతి బంగాళాఖాతంలో నెలకొన్న తీవ్ర వాయుగుండం ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరిల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ఐఎండీ పలు జిల్లాలకు ఆరెంజ్, యెల్లో అలర్ట్‌లు జారీ చేయడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ మార్పులు కోస్తా తీరాన్ని వణికిస్తున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర వాయుగుండం మరింత బలపడిందని, దీని ప్రభావంతో తమిళనాడు వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది.
ముఖ్యంగా శనివారం నాడు తిరువారూర్, నాగపట్నం, మయిలాడుతురై, కడలూరు జిల్లాలతో పాటు పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆయా ప్రాంతాలకు వాతావరణ శాఖ ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేసింది. జనవరి 10న తమిళనాడులోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు, 11న అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
చెన్నైకి యెల్లో అలర్ట్.. అప్రమత్తంగా ఉండాలి!
తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై సహా చెంగల్పట్టు, తిరువళ్లూరు, కాంచీపురం, విల్లుపురం, కళ్లకురిచ్చి, అరియలూర్, తంజావూరు, పుదుక్కోట్టై, రామనాథపురం జిల్లాలకు వాతావరణ శాఖ ‘యెల్లో అలర్ట్’ ప్రకటించింది. ఈ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
చెన్నైలో గరిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉందని, కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ బులెటిన్‌లో పేర్కొంది.
వాయుగుండం ఎక్కడ కేంద్రీకృతమైంది?
తాజా సమాచారం ప్రకారం.. ఈ తీవ్ర వాయుగుండం శ్రీలంకలోని బట్టికలోవాకు ఉత్తర ఈశాన్యంగా 100 కిలోమీటర్లు, పుదుచ్చేరి కారైకాల్‌కు ఆగ్నేయంగా 370 కిలోమీటర్లు, చెన్నైకి ఆగ్నేయంగా 550 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది వాయువ్య దిశగా కదులుతూ క్రమంగా బలహీనపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఈ రోజు మధ్యాహ్నం లోపు ఇది శ్రీలంక తీరాన్ని దాటవచ్చు.
సముద్రం అల్లకల్లోలం.. మత్స్యకారులకు హెచ్చరిక..
వాయుగుండం ప్రభావంతో తీరం వెంబడి గంటకు 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, గాలి వేగం అప్పుడప్పుడు 60 కిలోమీటర్ల వరకు చేరవచ్చని హెచ్చరించారు.
ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాల్లో శనివారం సాయంత్రం వరకు పరిస్థితి తీవ్రంగా ఉంటుంది. కొన్ని చోట్ల 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి.
హెచ్చరిక: మన్నార్ గల్ఫ్, కోమరిన్ ప్రాంతం, శ్రీలంక-తమిళనాడు తీరాలకు వెళ్లే మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఆంధ్రలో ఇలా..
అమరావతి వాతావరణ కేంద్రం బులిటెన్ ప్రకారం.. ఉత్తర కోస్తాలో శనివారం పొడి వాతావరణం, పొగమంచు వాతావరణ పరిస్థితులుంటాయి.
దక్షిణ కోస్తాలో శని, ఆదివారాల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడే సూచనలున్నాయి.
రాయలసీమ ప్రాంతంలో శని, ఆదావారాల్లో ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడొచ్చు.
రాగల 4 రోజుల్లో కోస్తాంధ్రా, యానాం, రాయలసీమ కనిష్ట ఉష్ణోగ్రతల నమోదులో గణనీయమైన మార్పులు ఉండకపోవచ్చని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.


































