శబరిమల అయ్యప్పకు ఘోర అపచారం జరిగింది. నిరపుతరి మహోత్సవం సందర్భంగా పతినేట్టంపడి పై నిలబడి పోలీసు అధికారి అగౌరవంగా ప్రవర్తించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడం అయ్యప్ప భక్తులకు ఆగ్రహం తెప్పిస్తుంది.
జూలై 30, 2025న, నీరపుతరి మహోత్సవం సందర్భంగా , శబరిమలలో జరిగిన ఒక సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పవిత్రమైన 18 మెట్ల పైన పోలీస్ అధికారి చేసిన పనికి షాక్
దేశవ్యాప్తంగా అయ్యప్ప స్వామి భక్తుల అసహనానికి కారణంగా మారింది. ఒక పోలీసు అధికారి పవిత్రమైన పతినేట్టంపడిపై నేరుగా నిలబడి , మరొక అధికారితో సంభాషణలో పాల్గొంటూ తన పాదాన్ని దానిపై రుద్దుతూ కనిపించాడు. అయ్యప్ప స్వామిని పూజించే భక్తులు పరమ నిష్టతో స్వామిని పూజించి, 18 మెట్ల పైన నడవడానికి పరమ పవిత్రంగా భావిస్తే, పోలీస్ అధికారి మాత్రం అది మరచిపోయాడని మండిపడుతున్నారు.
పవిత్రమైన 18 మెట్ల పవిత్రతకు భంగం కలిగించిన పోలీస్ అధికారి
పవిత్రమైన 18 మెట్ల పైన నిలబడి వేరే అధికారితో సంభాషిస్తూ మెట్టు పైన కాలు రుద్దుతూ కనిపించడం మెట్ల పవిత్రతకు భంగం కలిగిస్తుందని భక్తులు భావిస్తున్నారు. ఆ పోలీస్ చర్యలు పవిత్ర స్థలం యొక్క పవిత్రతను పూర్తిగా విస్మరించాయని వారంటున్నారు. రికార్డ్ చేసిన సంఘటన యొక్క వీడియో ఫుటేజ్ వెలుగులోకి రావడంతో ఆందోళన చెందుతున్న భక్తులు శబరిమల ఆలయ పవిత్రతను కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
గతంలోనూ 18మెట్లపై పోలీసుల ఫోటో షూట్
ఇది ప్రపంచవ్యాప్తంగా భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచిన ఘటనగా వారు చెబుతున్నారు. ఇటువంటి అగౌరవం కొనసాగడం తమకు చాలా బాధ కలిగించిందని, గత సంవత్సరం , పోలీసు అధికారులు పవిత్రమైన ఏనుగు మరియు పులి విగ్రహాలపై కూర్చుని , పతినేట్టంపడిని ఫోటో స్పాట్ గా ఉపయోగించడం కూడా అప్పుడు తమకు బాధ కలిగించిందని గుర్తు చేశారు.
చర్యలు తీసుకోవాలని ట్రావెన్కోర్ దేవస్వం బోర్డుకు భక్తుల విజ్ఞప్తి
పవిత్రమైన శబరిమలలో అటువంటి ప్రవర్తనకు వ్యతిరేకంగా కఠినమైన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు మరియు సంబంధిత అధికారులను కోరుతున్నామని అయ్యప్ప భక్తులు అంటున్నారు. పతినేట్టంపడి అనేది కేవలం కొన్ని మెట్ల వరుస కాదని, ఇది గౌరవనీయమైన ఆధ్యాత్మిక చిహ్నం అంటున్నారు . ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులకు అంతిమ గమ్యస్థానం అని చెబుతున్నారు. ఈ పవిత్ర స్థలం పట్ల అగౌరవాన్ని ఎప్పుడూ సహించకూడదని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నారు.
































