పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఐసిఐసిఐ బ్యాంక్ అక్రమాల డొంక కదులుతోంది. ఒకటే కాదు రెండు బ్యాంకుల్లో నగదు, బంగారం మాయమైనట్లు సీఐడీ అధికారులు తెలిపారు.
చిలకలూరిపేట ICICI బ్యాంక్‌లో గోల్‌మాల్‌పై ఎంక్వైరీ ప్రారంభించిన సీఐడీ అధికారులు పలు కీలక వివరాలను సేకరించారు. గతంలో బ్రాంచ్ మేనేజర్‌గా పనిచేసిన నరేష్, అప్రజైర్ హరీష్ భారీగా గోల్‌మాల్ చేశారని సీఐడీ నిర్ధారించింది. చిలకలూరిపేటతోపాటు నరసరావుపేట బ్రాంచ్‌లోనూ మోసాలకు పాల్పడినట్లు నిగ్గుతేల్చారు. కాగా.. తాము డిపాజిట్ చేసిన నగదు మాయమవడంతో కస్టమర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు బ్యాంకు ఉన్నతాధికారులు కూడా ఈ వ్యవహారంపై విచారణ ప్రారంభించారు. ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే నకిలీ బాండ్ ఇష్యూ చేయడంతో అనుమానాలు తలెత్తాయి. ఆరా తీస్తే ఈ దారుణాలు బయటపడ్డాయి. కస్టమర్లకు తెలియకుండా ఫిక్స్‌డ్ డిపాజిట్ల మీద రుణాలు జారీ చేశారు. తనఖా పెట్టి లక్ష రూపాయల లోన్ తీసుకుంటే అంతకు మించి రుణం తీసుకున్నట్టు రికార్డుల్లో రాశారు. ఇలా మోసాలు తెరపైకి రావడంతో ఖాతాదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ముందు పోలీసులు విచారణ ప్రారంభించారు.. ఆ తర్వాత ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది.. విచారణ ప్రారంభించిన ఏపీ సీఐడీ అధికారులు పలువురు అధికారులను ప్రశ్నించారు. చిలకలూరిపేట, నరసరావుపేట ఐసీఐసీఐ శాఖల్లో అక్రమాలు జరిగినట్లు తేల్చారు. చిలకలూరిపేట శాఖలో ఖాతాదారుల డబ్బు మళ్లించినట్లు సీఐడీ అదనపు ఎస్పీ ఆదినారాయణ వెల్లడించారు. మొత్తం 28 కోట్లు గోల్ మాల్ జరిగినట్లు తెలిపారు.
బ్యాంకు సిబ్బందిపై CID అధికారుల ప్రశ్నలవర్షం కురిపిస్తున్నారు. అంతేకాకుండా ఖాతాదారుల నుంచి వివరాలను రాబడుతున్నారు. బ్యాంక్‌లో బంగారంతోపాటు, ఫిక్స్‌డ్ డిపాజిట్ల నుంచి నగదు మాయమైనట్లు ఇప్పటికే సీఐడీ అధికారులు గుర్తించారు. మొత్తం 78 మంది బాధితులు ఉన్నారని.. లోతైన దర్యాప్తు తర్వాత వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. పరారీలో వున్న నరేష్, హరీష్ గతంలో కూడా ఇలాంటి మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు.
కాగా.. తమ ఓవర్ డ్రాఫ్ట్ ఖాతాల్లో లిమిట్‌ను పెంచి ఆ మొత్తాన్ని ఇతరులకు ట్రాన్స్‌పర్ చేశారని కొందరు వ్యాపారులు చెప్తున్నారు. గత మేనేజర్ నరేష్, అప్రైజర్ హరీష్ కోసం లుక్ ఔట్ నోటీస్ జారీ చేసిన అధికారులు.. వారి కోసం గాలిస్తున్నారు.