కేంద్ర ప్రభుత్వం మధ్యతరగతి ప్రజలకు త్వరలో ఒక శుభవార్త చెప్పనుంది. వార్షిక ఆదాయం రూ.15 లక్షల వరకు ఉన్నవారికి ఆదాయ పన్ను తగ్గించే (Income tax relief) ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ కొంత మందగమనంలో ఉన్న నేపథ్యంలో, ఈ నిర్ణయం సామాన్యులకు నిజంగా పెద్ద ఊరటనిస్తుంది. ముఖ్యంగా, నగరాల్లో అధిక జీవన వ్యయాలతో ఇబ్బంది పడుతున్నవారికి ఇది ఎంతో మేలు చేస్తుంది. ఈ మార్పుతో లక్షలాది మంది పన్ను చెల్లింపుదారుల జేబుల్లో కాస్త ఎక్కువ డబ్బు మిగులుతుంది.
వచ్చే ఏడాది ప్రవేశపెట్టనున్న 2025 కేంద్ర బడ్జెట్‌లో ఈ ప్రకటన రావచ్చని సమాచారం. అయితే, పన్ను ఎంత తగ్గిస్తారనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. బడ్జెట్ సమయానికి దీనిపై ఒక స్పష్టమైన ప్రకటన రావచ్చు. కేంద్ర ఆర్థిక శాఖ దీనికి సంబంధించిన తుది కసరత్తులో ఉన్నట్లు తెలుస్తోంది.
ట్యాక్స్ రేట్స్:
ప్రస్తుతం మన దేశంలో ఆదాయపు పన్ను విధానం ఎలా ఉందో చూస్తే.. ఒక వ్యక్తి యాన్యువల్ ఇన్‌కమ్ రూ.3 లక్షల నుంచి రూ.15 లక్షల మధ్య ఉంటే, వారు 5% నుంచి 20% వరకు ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. అదే వారి ఆదాయం రూ.15 లక్షలు దాటితే, ఏకంగా 30% పన్ను కట్టాలి. అయితే, పన్ను చెల్లించేందుకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. మొదటిది పాత పన్ను విధానం. ఇందులో ఇంటి అద్దె, బీమా లాంటి వాటికి ట్యాక్స్ ఎగ్జమ్షన్స్ ఉంటాయి. అంటే, ఈ ఖర్చులు చూపిస్తే, పన్ను భారం కాస్త తగ్గుతుంది.
రెండోది కొత్త పన్ను విధానం (2020లో వచ్చింది). ఇందులో పన్ను రేట్లు కాస్త తక్కువగా ఉంటాయి. కానీ, పాత విధానంలో ఉన్నట్టు ఎగ్జమ్షన్స్ ఉండవు. అంటే, ఎలాంటి ఖర్చులు చూపించినా పన్ను మాత్రం కట్టాల్సిందే. ఈ రెండింటిలో మీకు ఏది బెటరో తెలుసుకోవడానికి మీ ఆదాయం, ఖర్చులు బట్టి ఏ విధానం ఎంచుకుంటే ఎక్కువ లాభం ఉంటుందో లెక్కలు వేసుకోవాలి.
పన్నుల్లో మార్పు ఎందుకు అవసరం?
మధ్యతరగతి ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా పన్ను రాయితీ (Tax relief) కోసం డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆహార పదార్థాల ధరలు విపరీతంగా పెరగడంతో, వారి కొనుగోలు శక్తి బాగా తగ్గిపోయింది. నిత్యావసర వస్తువులు, సేవలు కొనడానికి కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. పన్ను తగ్గింపుతో వారి చేతిలో కాస్త ఎక్కువ డబ్బు ఉంటుంది, తద్వారా పెరుగుతున్న ధరలను కొంతవరకు తట్టుకోగలుగుతారు. ఇది నిజంగా సామాన్యులకు ఊరటనిచ్చే అంశం.
ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మన భారతదేశం. కానీ, 2024 జులై నుంచి సెప్టెంబర్ మధ్యకాలంలో ఆర్థిక వ్యవస్థ అనుకున్నంత వేగంగా అభివృద్ధి చెందలేదు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం పన్నులు తగ్గిస్తే, ప్రజల దగ్గర ఎక్కువ డబ్బు ఉంటుంది. దాంతో వారు కార్లు, బైక్‌లు, నిత్యావసర వస్తువులు కొంటారు. ఇలా కొనుగోళ్లు పెరిగితే, వ్యాపారాలు మళ్లీ ఊపందుకుంటాయి, తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ మళ్లీ పుంజుకుంటుంది.
నిర్మలా సీతారామన్ హామీ
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఆందోళనలను గుర్తించారు. పన్ను రాయితీ కోసం సోషల్ మీడియాలో వచ్చిన విజ్ఞప్తికి స్పందిస్తూ, ప్రభుత్వం ప్రజల అభిప్రాయానికి విలువ ఇస్తుందని ఆమె హామీ ఇచ్చారు. గత దశాబ్దంలో మధ్యతరగతిపై పన్ను భారాన్ని తగ్గించడానికి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను ఆమె గుర్తు చేశారు.