Peddireddy: పుంగనూరులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి భారీ షాక్

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఊహించని భారీ షాక్ తగిలింది. పుంగనూరు నియోజకవర్గంలో నిన్నటి వరకు తనదే హవా అంటూ చక్రం తిప్పిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పుంగనూరు నేతలు ఝలక్ ఇచ్చారు.


పుంగనూరు మున్సిపల్ చైర్మన్ అలీమ్ భాషా తో పాటు 12 మంది మున్సిపల్ కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీలో చేరారు.

పుంగనూరు మున్సిపల్ చైర్మన్ తో పాటు కౌన్సిలర్లు టీడీపీ తీర్ధం

స్థానిక టిడిపి ఇన్చార్జి చల్లా రామచంద్రారెడ్డి ఇంటి వద్ద నిర్వహించిన కార్యక్రమంలో మొత్తం 12మంది చైర్మన్ తో పాటు కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో పుంగనూరు మున్సిపల్ కార్యాలయం పై టిడిపి జెండా రెపరెపలాడే అవకాశం ఉందని టీడీపీ శ్రేణులు భావిస్తున్నారు. మొత్తం 31మంది సభ్యులు ఉన్న పుంగనూరు మునిసిపాలిటీలో మళ్లీ ఒక వారంలోపు మరికొంతమంది కౌన్సిలర్లు టిడిపిలో చేరడానికి రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.

పెద్దిరెడ్డి పై మండిపడిన పార్టీ మారిన నేతలు

చల్లా రామచంద్రారెడ్డి పక్కా వ్యూహంతో ఊహించని విధంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి బిగ్ షాక్ తగిలింది. ఇక వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్న అనంతరం పుంగనూరు మున్సిపల్ చైర్మన్ మీడియాతో మాట్లాడారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో పదవిలిచ్చినా పవర్ ఇవ్వలేదని పవర్ అంతా నాటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతుల్లోనే ఉండేదని ఆరోపించారు.

పదవులిచ్చినా పవర్ పెద్దిరెడ్డి చేతుల్లోనే

అందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పిన మునిసిపల్ చైర్మన్ ఈ మూడేళ్లు పుంగనూరు ప్రజలకు న్యాయం చేయలేకపోయామని పేర్కొన్నారు. అందరినీ కలుపుకొని పుంగనూరులో టిడిపిని బలోపేతం చేస్తామని టిడిపిలో అందరు నేతలను కలుపుకొని ముందుకు సాగుతామని కౌన్సిలర్లు తెలిపారు. గత 25సంవత్సరాలుగా ప్రజలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ పాలనతో విసిగిపోయారని టిడిపి ఇన్చార్జి చల్లా రామచంద్రారెడ్డి ఆరోపించారు.

నియంతలా పెద్దిరెడ్డి

పెద్దిరెడ్డి కుటుంబం జిల్లా మొత్తాన్ని తమ గుప్పెట్లో పెట్టుకొని నియంతలా వ్యవహరించిందని ఆరోపించారు.అందువల్లే ఎలాంటి అభివృద్ధి చెయ్యలేకపోయారన్నారు. నిన్నటివరకు బీజేపీని,. ఎన్డీయే కూటమిని తిట్టిన ఎంపీ మిథున్ రెడ్డి ఇప్పుడు పార్లమెంట్ లో బీజేపీకి మద్దతు ఇవ్వటాన్ని ఎలా చూడాలో చెప్పాలని ప్రశ్నించారు.