పెట్రోల్, విద్యుత్ అవసరం లేని హైబ్రిడ్ కారు.. ఖర్చులను తొక్కుకుంటూ పోవడమే

www.mannamweb.com


ప్రస్తుతం అందరూ పెట్రోల్ భారం తగ్గించుకునేందుకు ఎలక్ట్రిక్ వాహనాల వైపే కార్ల వైపే మొగ్గు చూపుతున్నారు. అనేక కంపెనీలు ఎలక్ట్రిక్ టూవీలర్, ఫోర్ వీలర్ వాహనాలను తయారు చేస్తున్నాయి. కొన్ని కంపెనీలు అయితే ప్రత్యేకంగా సామాన్య, మధ్యతరగతి వారి కోసం తక్కువ ధరకే బుల్లి కార్లను తయారు చేస్తున్నాయి. సోలార్ తో కూడా నడిచే కార్లను కూడా ఓ కంపెనీ తయారు చేస్తుంది. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే కారుని సైకిల్ లా తొక్కుకుంటూ పోయేలా ఒక సరికొత్త హైబ్రిడ్ కారుని తయారు చేసిందో కంపెనీ. కార్ బైక్స్.. ఇదొక హైబ్రిడ్ వాహనం. కారుని, సైకిల్ ని కలిపితే వచ్చిందే ఈ కార్ బైక్స్ హైబ్రిడ్ కారు. ఇది కార్గో సైకిల్ కి, ఎలక్ట్రిక్ మైక్రో సిటీ కారుకి మధ్యలో ఉంటుంది. చిన్న చిన్న పట్టణాల్లో, నగరాల్లో రవాణా కోసం దీన్ని వాడుకోవచ్చు. ఈదురుగాలులు, వర్షాల నుంచి రక్షణ ఇచ్చేలా దీన్ని ఒక కారు డిజైన్ లో రూపొందించారు. స్టీల్ ఫ్రేమ్, అల్ట్రా లైట్ అల్యూమినియం షెల్ తో దీన్ని డిజైన్ చేశారు.

ఇద్దరు పెద్దవాళ్ళకి లేదా ఇద్దరు పిల్లలతో పెద్ద వయసున్న వారికి (ముగ్గురికి) సరిపోయేలా దీన్ని రూపొందించారు. కారులానే దీనికి నాలుగు చక్రాలను అమర్చారు. ఇది గంటకు 25 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది. ఇందులో ఎలక్ట్రిక్ పెడలింగ్ సిస్టం ఉంటుంది. ఆటోమేటిక్ గేర్లు ఉంటాయి. కాళ్లతో తొక్కుతుంటే కారు ముందుకు వెళ్తుంది. అయితే రిక్షా తొక్కినట్టు కష్టపడి చెమటోడ్చి తొక్కే పని లేదు. ఎందుకంటే దీని పై భాగంలో ఒక సోలార్ ప్యానెల్ ఇచ్చారు. ఆ సోలార్ ప్యానెల్ ద్వారా ఈ హైబ్రిడ్ సైకిల్ కారులో ఉన్న బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. తద్వారా మోటార్ ఆపరేట్ అయ్యి ముందుకు నడుస్తుంది. ఈ వాహనంలో ఉన్న వారు కష్టపడకుండా జాలీగా తొక్కితే చాలు ముందుకు వెళ్లిపోతుంది.

ఇందులో 750 వాట్ బ్యాటరీని అమర్చారు. 400 లీటర్లు లేదా 150 కిలోల విశాలమైన ట్రంక్ ని ఇచ్చారు. దీన్ని తొక్కడం ద్వారా కరెంట్ అనేది ఉత్పత్తి అవుతుంది. అలానే సోలార్ ప్యానెల్ నుంచి వచ్చే కరెంట్ ద్వారా కూడా ఛార్జ్ అవుతుంది. అలా ఈ సైకిల్ కమ్ కారు సింగిల్ బ్యాటరీ ఛార్జ్ తో 75 కి.మీ. ప్రయాణిస్తుంది. దీన్ని ఫ్రాన్స్ దేశానికి చెందిన స్టార్టప్ కంపెనీ తయారు చేసింది. మరి ఈ టెక్నాలజీని బేస్ చేసుకుని మన దేశంలో ఎవరైనా ఈ మోడల్ హైబ్రిడ్ కార్లను తీసుకొస్తారో లేక ఇంతకంటే హై టెక్నాలజీతో తీసుకొస్తారో చూడాలి. మొత్తానికి ఈ కారు వల్ల ఆరోగ్యం విషయంలో భయపడేవారికి మేలు చేకూరుతుంది. ఉదయాన్నే కొవ్వు కరిగించుకునేందుకు కిలోమీటర్ల మేర జాగింగ్ లు చేసే కంటే ఈ సైకిల్ కమ్ కారుని కొనుక్కుని ఆఫీసులకు వేసుకెళ్తే ఆరోగ్యంగా, ఆర్థికంగా బాగుంటారు.