హిందూపురం పట్టణంలో నివాసం ఉంటున్న బుక్కపట్నం మండలం ధూపంపల్లికి చెందిన వరలక్ష్మి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ పరీక్షలో ఆంగ్ల సబ్జెక్ట్ స్కూల్ అసిస్టెంట్ లో 101వ ర్యాంకు సాధించింది, ఎంపిక జాబితాలో 85 నెంబర్‌లో ఉంది.
దీంతో ఆమెకు ఉపాధ్యాయ ఉద్యోగానికి ఎంపికైనట్లు విద్యాశాఖ అధికారులు సమాచారం ఇచ్చారు. అమరావతిలో నియామక ఉత్తర్వులు తీసుకునేందుకు బయలుదేరి, కార్యక్రమం వాయిదాతో వెనుతిరిగారు. బుధవారం అమరావతికి బయలుదేరాల్సి ఉండగా మంగళవారం జిల్లా విద్యాశాఖ అధికారి ఆమెకు ఫోన్ చేశారు. అమరావతికి రావలసిన అవసరం లేదని డిఇఒ ప్రసాద్ బాబు ఆమెకు వివరించారు.
దీంతో ఆమె ఒక్కసారిగా ఖంగుతింది. అర్హత సాధించినప్పటికీ తనకు ఉద్యోగం ఎందుకు ఇవ్వడం లేదని వాపోయింది. కష్టపడి చదివి ప్రభుత్వం నిర్వహించిన టెట్, డీఎస్సీలో ఉత్తీర్ణత సాధించినప్పటికీ తనకు ఎందుకు ఉద్యోగం ఇవ్వడం లేదని అధికారులను నిలదీస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం అనంతపురంలోని జిల్లా విద్యాశాఖ అధికారి ప్రసాద్ బాబు ని కలిసి తన గోడును చెప్పుకుంది.ీ ఇది తన పరిధిలో లేదని రీజనల్ జాయింట్ డైరెక్టర్ పరిధిలో ఉందని ఆయన చేతులెత్తేశారు.
ఈ విషయంపై వరలక్ష్మీ మాట్లాడుతూ, 2025 డీఎస్సీలో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ కి సెలెక్ట్ కావడం జరిగిందన్నారు. ప్రభుత్వ నియమ నిబంధన ప్రకారం సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా పూర్తయి, ఈనెల 10వ తేదీన విజయవాడ రమ్మని చెప్పారన్నారు. ఈనెల 22వ తేదీ గుంటూరులో జరిగే మీటింగ్ కు హాజరు కావాలని డిఇఒ ఆఫీస్ నుంచి సమాచారం వచ్చిందన్నారు. అయితే మంగళవారం రాత్రి 8:30 సమయంలో డీఈఓ ఫోన్ చేసి సెలెక్ట్ కాలేదు.
మీకంటే ముందు ర్యాంకు ఉన్న ఆంజనేయులు అనే అభ్యర్థికి ఉద్యోగం ఇచ్చామని చెప్పారన్నారు. అయితే తాను టీజీటీలో 250 ర్యాంకు సాధించాననని ఆ ర్యాంకు ప్రకారం జోన్-4 లో తీసుకున్నప్పటికీ టాప్ లిస్టులో రెండవ స్థానంలో 250 ర్యాంకుతో టి జి టి పోస్ట్‌కు తనకు అర్హత ఉందని అంది. అందులో ఉద్యోగం ఇవ్వాలని అధికారులను కోరుతున్నప్పటికీ ఏ ఒక్కరు కూడా తన అభ్యర్థనను ఆలకించడం లేదనిఆవేదన వ్యక్తం చేసింది. ఎంతో కష్టపడి స్కూల్ అసిస్టెంట్ తో పాటు టిజీటీలో అర్హత సాధించానని కనీసం పిజిటిలోనైనా తనకు ఉద్యోగం ఇవ్వాలంటూ వరలక్ష్మి వేడుకుంటోంది.
































