Egypt pyramids: ప్రపంచంలో ఈజిప్టు పిడమిడ్స్ మిస్టరీ ఇప్పటికీ వీడలేదు. అసాధారణమైన ఈ నిర్మాణాలను ఎలాంటి టెక్నాలజీ లేకుండా ఎలా నిర్మించారనేది ఇప్పటికీ సందేహాలను వస్తూనే ఉంటాయి. పరిశోధకులు వీటికి అనేక థీయరీలు కనిపెట్టినా, అనుమానాలు అలాగే ఉన్నాయి. భారీ సైజు బండరాళ్లు, వాటిని నిర్మించేందుకు ఉపయోగించే సామాగ్రిని ఎడారి ప్రాంతంలో ఎలా తరలించారనేది తెలియడం లేదు. పురాతన కాలంలో ఈజిప్టును పాలించిన ఫారో రాజులు ఈ పిరమిడ్లను నిర్మించారు. ఈ రాజవంశం గురించి కూడా అనేక రహస్యాలు ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయి. 2550 బీసీలో ఫారో ఖుఫూ వీటి నిర్మాణాన్ని ప్రారంభించినట్లు చరిత్ర చెబుతోంది.
ఇదిలా ఉంటే తాజాగా ఈ మిస్టరీలో కీలక పరిణామం ఎదురైంది. ఈజిప్టు వరప్రధాయినిగా ఉన్న ‘‘నైలు నది’’ పిరమిడ్స్ నిర్మాణానికి ఉపయోగపడిందని పరిశోధకులు నిర్ధారించారు. ఆధునిక నైలు నదికి చెందిన ఒక నదీపాయ, ఆ కాలంలో పిరమిడ్లు ఉన్న స్థలానికి దగ్గరగా ప్రవహించినట్లు తేలింది. గిజా పిరమిడ్ కాంప్లెక్స్‌తో సహా ఈజిప్ట్‌లోని 31 పిరమిడ్‌లు వాస్తవానికి నైలు నది యొక్క 64-కిమీ-పొడవు ఉన్న నైలు నదీకి చెందిన ఒక శాఖ ఈ ప్రాంతం నుంచి ప్రవహించేదని, కాలానుగుణంగా ఇప్పుడు అది ఎడారి ఇసుక కింద పాతిపెట్టబడిందని కమ్యూనికేషన్స్ ఎర్త్ & ఎన్విరాన్‌మెంట్‌లో ప్రచురించబడిన ఓ పరిశోధన పత్రం వెల్లడించింది.
గిజా, లిష్ట్ మధ్య ప్రసిద్ధ ఈజిప్షియన్ పిరమిడ్స్ ఉన్న ప్రాంతానికి సమీపంలో ఒకప్పుడు ప్రవహించిన పురాతన నైలు నది శాఖకు సంబంధించిన ఆధారాలను పరిశోధకులు కనుగొన్నారు. దాదాపుగా 4700 ఏళ్ల క్రితం నిర్మితమైన ఈ అద్భుత కట్టడాలు ప్రస్తుతం పశ్చిమ ఎడారి ప్రాంతంలోని అంచున ఉన్నాయి. ఉపగ్రహ చిత్రాలు, జియోఫిజికల్ సర్వేలు, సెడిమెంట్ కోర్‌లను అద్యయనం చేయడం ద్వారా, ఎమాన్ ఘెనిమ్, అతని సహచరులు ఆధునిక ఉపరితలం కింద నదీ అవక్షపాలు, పూర్వపు నదీపాయల ఉనికిని నిర్ధారించారు. వారు ఈ పూర్వపు శాఖలకు ‘‘అహ్రామత్’’ అని పేరుపెట్టారు. అరబిక్‌లో దీని అర్థం పిరమిడ్.
పిరమిడ్ల నిర్మాణానికి ఈ నదీ పాయ ద్వారా సులభంగా పరికరాలను, రాళ్లను చేర్చినట్లు పరిశోధకులు భావిస్తున్నారు. అనేక పిరమిడ్‌లు నదీ తీరాలకు నేరుగా చేరుకునే కాజ్‌వేలను కలిగి ఉన్నాయి. నిర్మాణసామాగ్రిని తరలించడానికి ఈ జలమార్గాలు ఉపయోగించినట్లు తెలుస్తోంది. 4,200 సంవత్సరాల క్రితం పెద్ద కరువు ఏర్పడి, గాలిలో ఇసుక తూర్పుకి వచ్చి చేరడం వల్ల ఈ నదీ శాఖ అనవాళ్లు తుడిచిపెట్టుకుపోయాయని పరిశోధకులు భావిస్తున్నారు.