పేరులో అక్షరం తేడా.. 45 ఏళ్లుగా నో పెన్షన్‌..!

తండ్రి మరణం తర్వాత వచ్చే పింఛను కోసం ఓ మహిళ నాలుగు దశాబ్దాలకుపైగా పోరాటం చేస్తున్నారు. పేరులో ఒక్క అక్షరం తేడా ఉందనే కారణంతో పింఛను ఇచ్చేందుకు అధికారులు నిరాకరిస్తున్నారు. దీంతో ఆమె అలహాబాద్‌ హైకోర్టును ఆశ్రయించారు. సంబంధిత పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. అధికారుల తీరుపై మండిపడింది. సమస్య పరిష్కారానికి వారంలోగా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.


ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పుర్‌కు చెందిన మంజు రాయ్‌ తండ్రి స్థానిక మున్సిపల్‌ కార్పొరేషన్‌లో పనిచేశారు. 1975లో పదవీ విరమణ చేశారు. 1980లో మృతి చెందగా.. అప్పటివరకు పింఛన్‌ సరిగ్గానే వచ్చేది. అనంతరం ఫ్యామిలీ పెన్షన్‌ కోసం కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకోగా.. ఆయన పేరులో అక్షరం తేడా ఉందనే కారణంతో నిరాకరించారు. సర్వీసు రికార్డుల్లో ఆయన పేరు శిఖర్‌ నాథ్‌ శుక్లా (Shikhar Nath Shukla)గా నమోదై ఉండగా.. దరఖాస్తు, ఇతర పత్రాల్లో శేఖర్ నాథ్ శుక్లా (Shekhar Nath Shukla)గా ఉంది. ‘I’, ‘E’ తేడాతో ఫ్యామిలీ పెన్షన్‌ మంజూరు కావడం లేదు. 45 ఏళ్లుగా సమస్య అలాగే కొనసాగుతోంది.

దీంతో మంజు రాయ్‌.. అలహాబాద్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. పేరులో ఒక్క అక్షరమే తేడా ఉందని, దీనిపై అఫిడవిట్ కూడా సమర్పించినట్లు పేర్కొన్నారు. వారసత్వ ధ్రువీకరణ పత్రం, ఇతర పత్రాలను కూడా జతచేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. వారం రోజుల్లోగా సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించింది. లేనిపక్షంలో తదుపరి విచారణకు మున్సిపల్ కమిషనర్ స్వయంగా హాజరు కావాల్సి ఉంటుందని హెచ్చరించింది.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.