క్యాబినెట్‌ కూర్పుపై సుదీర్ఘ కసరత్తు.. చంద్రబాబు నివాసానికి ఆశావహుల క్యూ!

క్యాబినెట్‌ కూర్పుపై సుదీర్ఘ కసరత్తు.. చంద్రబాబు నివాసానికి ఆశావహుల క్యూ!


అమరావతి: మంత్రివర్గ కూర్పుపై తెదేపా అధినేత చంద్రబాబు తన నివాసంలో సుదీర్ఘంగా కసరత్తు చేస్తున్నారు. దీంతో మంత్రివర్గంలో చోటు కోసం పలువురు ఆశావహులు ఆయన నివాసానికి క్యూ కట్టారు. తమ అధినేతను కలిసి ఆయన దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు, కూటమి ఎమ్మెల్యేలంతా మంగళవారం చంద్రబాబును ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నుకోనున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా చంద్రబాబు పేరును ప్రతిపాదించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

మంగళవారం ఉదయం 9.30గంటలకు విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్‌లో తెదేపా-జనసేన-భాజపా కూటమి శాసనసభ పక్ష సమావేశం జరగనుంది. కూటమి భాగస్వామ్యపక్షాల ఎమ్మెల్యేలంతా చంద్రబాబును శాసనసభ పక్ష నేతగా ఎన్నుకుంటూ ఏకగ్రీవ తీర్మానం చేయనున్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబును ఎన్నుకుంటూ చేసిన తీర్మానాన్ని కూటమి తరపున గవర్నర్‌కు అందజేయనున్నారు. మరోవైపు, ప్రమాణస్వీకారోత్సవానికి ముమ్మర ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. జూన్‌ 12న ఉదయం 11:27 గంటలకు నవ్యాంధ్రప్రదేశ్‌ మూడో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నారు.