పేకాటకు అనుమతి ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్లపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. భీమవరం కాస్మోపాలిటన్ క్లబ్, లార్డ్ హోర్డింగ్ హాల్ టౌన్ క్లబ్, నర్సాపురం యూత్ క్లబ్‌లు 13 కార్డ్స్ రమ్మీ ఆడేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించగా, డబ్బులు పందెంగా పెట్టి పేకాట ఆడటం చట్టవిరుద్ధమని స్పష్టం చేస్తూ ధర్మాసనం పిటిషన్లను తిరస్కరించింది.
విచారణ సందర్భంగా క్లబ్‌ల తరఫు న్యాయవాది సుప్రీం కోర్టు తీర్పులను ప్రస్తావిస్తూ 13 కార్డ్స్ రమ్మీకి అనుమతి ఇవ్వాలని వాదనలు వినిపించారు. అయితే, ఈ వాదనలను తోసిపుచ్చిన హైకోర్టు, డబ్బులకు పేకాట ఆడితే అది గాంబ్లింగ్ యాక్ట్ సెక్షన్ 3, 4 కింద నేరమని స్పష్టం చేసింది. అలాంటి సందర్భాల్లో తప్పనిసరిగా కేసులు నమోదు చేయాలని పోలీస్, యంత్రాంగానికి ఆదేశాలు ఇవ్వాల్సిందేనని పేర్కొంది.
పేకాట చట్టబద్ధతకు గట్టి బ్రేక్
ఇటీవల ఇలాంటి అంశాలపై ఇప్పటికే ఇదే తరహా ఆదేశాలు జారీ చేసినట్లు బెంచ్ గుర్తుచేసింది. నూజివీడు మాంగో బే క్లబ్ దాఖలు చేసిన పిటిషన్‌పై కూడా గతంలో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపింది. డబ్బులకు 13 కార్డ్స్ లేదా రమ్మీ ఆడితే చట్టపరమైన చర్యలు తప్పవని అప్పుడే జిల్లా పోలీసులకు ఆదేశాలు జారీ చేశామని కోర్టు పేర్కొంది. నేటి విచారణలో ఈ మూడు క్లబ్‌ల పిటిషన్ల విషయంలోనూ అదే చట్టపరమైన నియమాలు వర్తిస్తాయని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పుతో డబ్బులకు పేకాటకు చట్టబద్ధత కల్పించాలన్న ప్రయత్నానికి గట్టి బ్రేక్ పడినట్లైంది.


































