ఉరుకులు పరుగుల జీవితంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి.. అందుకే ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు మంచి జీవనశైలిని అవలంభించడం.. మంచి ఆహారం తీసుకోవడం చాలామంచిది..
అయితే.. ప్రస్తుత కాలంలో డయాబెటిస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి.. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా లక్షలాది మంది దీని బారిన పడుతున్నారు.. మధుమేహంలో కొన్ని సందర్భాల్లో రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగితే ప్రమాదకరంగా మారుతుంది. అయితే.. బ్లడ్ షుగర్ లెవెల్ ను కంట్రోల్ చేయడానికి కొన్ని హోం రెమెడీస్ అద్భుతంగా పనిచేస్తాయి.. అలాంటి వాటిలో బార్లీ ఒకటి.. బార్లీ గింజలను నానబెట్టి వాటి నీటిని తాగడం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా ప్రయోజనాలు కలుగుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
మధుమేహం చాలా మందిని ప్రభావితం చేసే ప్రధాన ఆరోగ్య సమస్య. అయితే.. బార్లీ వాటర్ మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. ఈ రిఫ్రెష్ పానీయం సహజంగా గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. బార్లీలో కరిగే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది అధిక రక్త చక్కెర ప్రమాదాన్ని తగ్గిస్తుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (NIH) నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం, బార్లీ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను గణనీయంగా తగ్గిస్తుంది.
బార్లీలో ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచే బయోయాక్టివ్ కాంపౌండ్స్ ఉంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు బయోయాక్టివ్ సమ్మేళనాలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. దీనివల్ల రక్తంలో చక్కెర పరిమాణం అదుపులో ఉంటుంది.
బార్లీ వాటర్ తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచుతాయి. అతిగా తినే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇది డయాబెటిస్ లో మేలు చేస్తుంది.
ఉదయాన్నే బార్లీ వాటర్ తాగడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. బరువు తగ్గడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మూత్ర సమస్యలు సైతం తగ్గుతాయి..
దీని కోసం రెండు మూడు స్పూన్ ల బార్లీ గింజలను రాత్రి నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగాలి.. దీంతో పాటు ఆ గింజలను కూడా తినాలి.. అంతేకాకుండా.. బార్లీ గింజలను లేదా పొడిని నీటిలో వేసి మరగబెట్టి కూడా తాగవచ్చు.. ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. (నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. పలు వార్తా కథనాలు, నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.)