‘జటాధర’ రివ్యూ: శివుడి భక్తులకు పునకాలే

వైవిధ్యానికి పెద్దపీట వేస్తూ కథలు ఎంచుకునే హీరో సుధీర్ బాబు, ‘హరోం హర’ వంటి పక్కా మాస్ యాక్షన్ తర్వాత, ఈసారి భయం మరియు ఆధ్యాత్మికత మేళవింపుతో కూడిన ‘జటాధర’ హార్రర్ ఫాంటసీ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.


బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా కీలక పాత్ర పోషించిన ఈ ద్విభాషా చిత్రం (తెలుగు, హిందీ) నవంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. మరి ఈ విభిన్నమైన ప్రయత్నం ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో ఈ సమీక్ష ద్వారా తెలుసుకుందాం.

కథ

‘జటాధర’ కథాంశం కేరళలోని ప్రసిద్ధ అనంత పద్మనాభ స్వామి ఆలయం చుట్టూ అల్లుకున్న వేల కోట్ల నిధితో మొదలవుతుంది. ఆ నిధిని కాపాడేందుకు వేసిన పవిత్రమైన పిశాచ బంధనం, కొందరి అత్యాశ కారణంగా విచ్ఛిన్నమై, ధన పిశాచి (సోనాక్షి సిన్హా) రూపంలో బయటకు వస్తుంది.

ప్రస్తుత కాలంలో, ఒక సాధారణ గృహిణి లంకె బిందెల కోసం ప్రయత్నించగా, పిశాచి ఆమెను ఆవహిస్తుంది. వింత ప్రవర్తనతో కూడిన ఈ కేసును పరిష్కరించడానికి, దెయ్యాలు, భూతాలు లేవని బలంగా నమ్మే ఘోస్ట్ హంటర్ శివ (సుధీర్ బాబు) రంగంలోకి దిగుతాడు. అహంకారంతో ఉన్న శివకు, ధన పిశాచికి మధ్య జరిగిన మైథాలజీ-హారర్ పోరాటం చివరకు ఏమైంది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

నటీనటుల పనితీరు

నటుడిగా ప్రతి సినిమాలోనూ మెరుగుపడుతున్న సుధీర్ బాబు, ‘జటాధర’కి ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఘోస్ట్ హంటర్ పాత్రలో ఆయన నటన, ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాలలో ఒళ్లు గగుర్పొడిచే విధంగా ఉంది. వైవిధ్యభరితమైన కథలకు ఆయన ఇస్తున్న ప్రాధాన్యత ఎలాంటిదో ఈ సినిమాలో ఆయన నటన చూస్తే అర్థం అవుతోంది.

బాలీవుడ్‌లో గ్లామర్ పాత్రలకే పరిమితమైన సోనాక్షి, ధన పిశాచిగా పూర్తిగా భిన్నమైన భయంకరమైన మేకోవర్‌లో ఆకట్టుకుంది. ఆమె లుక్స్, మేకప్ బాగున్నప్పటికీ, పాత్రకు అవసరమైనంత ‘ఇంటెన్సిటీ’ని నటనలో చూపించలేకపోయిందనే అభిప్రాయం ఉంది.21 ఏళ్ల తర్వాత దివ్య కోస్లా కుమార్, 33 ఏళ్ల తర్వాత శిల్పా శిరోద్కర్ తెలుగులోకి రీఎంట్రీ ఇవ్వడం విశేషం. మిగిలిన నటులు తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక అంశాలు

దర్శకుడు వెంకట్ కళ్యాణ్ (తెలుగు), అభిషేక్ జైస్వాల్ (హిందీ) లు మైథాలజీని, హార్రర్‌ను మిళితం చేసి కొత్త జోనర్‌ను అందించే ప్రయత్నం చేశారు. నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. కెమెరా పనితీరు ఈ సినిమాను మరో స్థాయికి తీసుకువెళ్లింది.

ప్లస్ పాయింట్స్: సినిమాకు సెకండాఫ్‌లోని హార్రర్ సన్నివేశాలు ప్రధాన బలం. నేపథ్య సంగీతం (BGM) అద్భుతంగా కుదిరింది, ముఖ్యంగా క్లైమాక్స్ ఎపిసోడ్‌ను BGM నిలబెట్టింది.

మైనస్ పాయింట్స్: ఫస్టాఫ్ చాలా నెమ్మదిగా సాగడం, కథకు అవసరం లేని సన్నివేశాలు ఎక్కువ ఉండటం వలన ఎడిటింగ్‌లో ఇంకాస్త జాగ్రత్త వహించి ఉండాల్సింది.

తీర్పు: ‘జటాధర’ ఒక సాధారణ హార్రర్ థ్రిల్లర్‌గా మొదలై, అనంత పద్మనాభ స్వామి ఆలయ సంప్రదాయాలు, మైథాలజీ అంశాలతో భిన్నంగా ముగుస్తుంది. ఓవరాల్‌గా, సుధీర్ బాబు వైవిధ్యమైన ప్రయత్నంగా దీనిని చూడవచ్చు. హార్రర్, ఫాంటసీ చిత్రాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.