శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలోని యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ (RSETI) గ్రామీణ నిరుద్యోగ యువత కోసం బంగారు అవకాశాన్ని తీసుకొచ్చింది. ఒక నెలపాటు అకౌంటెన్సింగ్, టాలీ, జీఎస్టీపై పూర్తిగా ఉచితంగా అందిస్తున్న ఈ శిక్షణ శిబిరం ప్రస్తుతం యువతలో మంచి స్పందనను రాబడుతోంది. డిజిటల్ బిల్లింగ్ యుగం వచ్చినప్పటి నుంచి ప్రతి చిన్న వ్యాపారం నుండి పెద్ద సంస్థల దాకా అకౌంటెంట్లకు డిమాండ్ భారీగా పెరగడంతో ఈ శిక్షణ మరింత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.
ఇప్పుడిక కాగితాల కాలం కాదు.. బిల్లింగ్, కొనుగోలు, అమ్మకాలు, జీఎస్టీ ఫైలింగ్ అన్నీ ఆన్‌లైన్. ఈ నేపథ్యంలో టాలీ, జీఎస్టీ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటే ఉద్యోగం అంటే ఇక అంత దూరం కాదు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటూ RSETI పూర్తిస్థాయి శిక్షణను అందిస్తోంది. శిక్షణలో పాల్గొనేవారికి టాలీ సాఫ్ట్‌వేర్‌లో బిల్ ఎలా క్రియేట్ చేయాలి? జీఎస్టీ ఈ–వే బిల్ ఎలా జనరేట్ చేయాలి? ప్రతి నెల కొనుగోలు, అమ్మకాల స్టేట్‌మెంట్లను జీఎస్టీ పోర్టల్‌లో ఎలా ఫైల్ చేయాలి? వంటి అన్నీ హ్యాండ్స్–ఆన్ పద్ధతిలో నేర్పిస్తారు. అంతేకాక బుక్ కీపింగ్ ప్రాథమికాలైన డెబిట్–క్రెడిట్ ఎంట్రీలు, రికార్డింగ్, వ్యాపార లావాదేవీల నిర్వహణ వంటి బేసిక్స్‌ను స్పష్టంగా బోధించి విద్యార్థులకు పకడ్బందీ అవగాహన కల్పిస్తారు.
ఈ శిక్షణలోని ముఖ్య ఆకర్షణ ఎటువంటి కోర్సు ఫీజు లేదు. నెలరోజుల శిక్షణ పూర్తయ్యాక అందించే సర్టిఫికేట్ గ్రామీణ యువతకు ఉద్యోగాలకు నేరుగా డోర్ ఓపెనర్‌లా మారే అవకాశం ఉంది. జీఎస్టీ వల్ల అన్ని వ్యాపారాల్లో డిజిటల్ రికార్డింగ్ తప్పనిసరి కావడంతో అకౌంటెంట్ల అవసరం ఎక్కడ చూసినా పెరిగిపోయింది. ఒక్క కోర్సుతో యువతకు రెండు మంచి అవకాశాలు లభిస్తాయి. మొదటిది.. ఉద్యోగం. స్థానికంగా రైస్ మిల్లులు, ప్రొవిజన్ దుకాణాలు, మెడికల్ షాపులు, చిన్న పెద్ద కంపెనీలు.. ఎక్కడ చూసినా అకౌంటెంట్ల కోసం వెతుకుతున్న దృశ్యం. టాలీ, జీఎస్టీ తెలిసినవారికి తక్షణ ఉద్యోగం దాదాపు ఖాయమే.































