ఆంధ్రప్రదేశ్లో విశేష ఆలయాలు ఎన్నో నెలకొని ఉన్నాయి. గ్రామ గ్రామాన ఒక పురాతన ఆలయంతప్పనిసరిగా కనపడి తీరుతుంది. ఈ కారణంగా మారుమూల పల్లెలలో కూడా హిందూమత సౌరభం నేటికీ వెల్లివిరుస్తోంది.
నదీతీరాలు ఋషి వాటికలకు నిలయాలు, మహర్షులు నియమబద్ధంగా నిర్వహించుకొనే అనుష్ఠానానికి, పూజాదులకు, యజ్ఞయాగాదులు, ఇతర నిత్య కర్మలకు నీరు అత్యంత ఆవశ్యకం. అందుకే అంటారు ‘జలం జీవం’అని. ఒక్కరోజు నీరు లేకపోతే నిత్య జీవితాలు ఎంత తల్లకిందులు అవుతాయో మనందరికీ అనుభవమే! కొన్ని వందల సంవత్సరాల క్రితం పావన నదీ (river) తీరాలలో మహర్షులు తమ నిత్య పూజల నిమిత్తం ప్రతిష్ఠించుకొన్న లింగాలు, అర్చనామూర్తులు నేటికీ మన రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో(areas) కనిపిస్తాయి.
పెన్నా, గోదావరి, కృష్ణా, వంశధార, నాగావళి నదీతీరాలు కొన్ని వేల సంవత్స రాల
నాగరికతకు, దేవదేవుని చేరుకొనే ఆధ్యాత్మిక మార్గానికి స్థావరాలు. లెక్కలేనన్ని ఆలయాలు ఈ నదీ తీరాలలో కనిపిస్తాయి. అలాంటి వాటిలో నేటి పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణానికి సమీపంలో కృష్ణవేణి తీరంలో నెలకొని ఉన్న శ్రీ గంగా భ్రమరాంబ సమేత శ్రీ బుగ్గ మల్లేశ్వర స్వామి ఆలయం ఒకటి.
క్షేత్ర గాథ
తొలి ఆలయ సముదాయాన్ని ఎవరు నిర్మించారన్న విషయాలు వెలుగులోకి రాలేదు. కొన్ని వందల సంవత్సరాల క్రితం మునివాటిక అయిన ఈ ప్రదేశంలో ఎందరో తాపసులు సర్వాంతర్యామి అనుగ్రహం కోసం తపస్సు చేసి ముక్తిని పొందారన్నది క్షేత్ర గాథ. అనేక
మంది అవధూతలు, పీఠాధిపతులు ఈ క్షేత్రాన్ని సందర్శించి అదే విషయాన్ని నిర్ధారించారు.
కానీ ప్రస్తుత ఆలయాన్ని పద్దెనిమిదో శతాబ్దంలో అమరావతిని రాజధానిగా చేసుకొని ఈ ప్రాంతాన్ని పాలించిన రాజావాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు నిర్మించారని తెలుస్తోంది. రాజ్య సంచారం చేస్తూ వెంకటాద్రి నాయుడు ఈ ప్రాంతానికి వచ్చారట. శిథిలావస్థలో ఉన్న ఆలయం గురించి విని పురుద్ధరణ చేసి ఆలయ నిర్వహణకు ధన,వస్తు మాన్యాలు సమర్పించుకొన్నారట.
అంతర కాలంలో స్థానిక గ్రామ పెద్ద ఆలయ నిర్వహణ బాధ్యతలు స్వయంగా తీసుకున్నట్లు
తెలుస్తోంది. నేటికీ వారి వంశంవారే ఆలయ ధర్మకర్తలుగా ఉన్నట్లు సమాచారం.
నాగ బంధం
ప్రధాన ఆలయం వెలుపలి గోడ పైన అరుదైన ‘నాగ బంధం’ చెక్కబడి ఉండటం మోర్జంపాడు శివాలయంలో కనిపించే అరుదైన విషయం. ఈ నాగ బంధాన్ని పూజించడం వలన బుద్ధిమాంద్యం
అత్యంత తొలగిపోతుంది. చదువులో ఏకాగ్రత పెరుగుతుంది, సర్ప దోష నివారణ కలుగుతుందని భక్తులు భావిస్తారు. భక్తులు ప్రత్యేక పూజలు చేస్తుంటారు.
నాగ బంధం అన్న విషయ తిరువనంతపురంలోని ప్రముఖ ‘శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయం ద్వారా అందరికీ తెలిసింది. ముఖ్యంగా ఆలయాలలో నాగ బంధం వేయడానికి గల కారణం రక్షణ. ఆలయానికి, ఆలయ నిర్మాణానికి, సంపదకు మంత్ర బద్ధమైన కాపలా అని చెప్పుకోవచ్చు. గిద్దలూరుకు సమీపంలోని మోక్షగుండం గ్రామంలో కొండ పైన కొలువైన శ్రీ ముక్తేశ్వర స్వామి ఆలయంలో;
గుంటూరుకు సమీపంలోని నంబూరు గ్రామంలో గల మల్లేశ్వర స్వామి ఆలయంలోనూ ఈ నాగ బంధాలుకనిపిస్తాయి.
ఆలయ విశేషాలు
తూర్పు ముఖంగా విశాల ప్రాంగణంలో నెలకొని ఉన్న శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి వారు కొలువైన మోర్జంపాడు క్షేత్రంలో ఎన్నో ఉపాలయాలు కనపడతాయి. మరెన్నో విశేషాలు, భక్తుల విశ్వాసాలతో ముడిపడి ఉన్న ప్రత్యేకతలు కనపడతాయి. మోర్జంపాడు ఆలయం శివకేశవ
నిలయం. ప్రాంగణ నైరుతిలో శ్రీ సీతారామ లక్ష్మణ స్వామివారి ఉపాలయం నెలకొని ఉంటుంది. పక్కనే క్షేత్ర పాలకుడు రుద్రాంశ సంభూతుడు అయిన అంజనాసుతుడైన శ్రీ ఆంజనేయ స్వామివారి సన్నిధి. ప్రాంగణంలో పెద్ద పెద్ద వాల్మీకాలు కనపడతాయి. అర్హులైన భక్తులకు నాగరాజ సందర్శనం లభిస్తుందని చెబుతారు.
వివాహంకాని యువతీ యువకులు, పిల్లలు లేని దంపతులు ఈ పుట్టలకు ప్రత్యేక పూజలు చేయిస్తే మనోభీష్టాలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. సుందరంగా రాతితో నిర్మించబడిన చిన్న ముఖమండపంలో ద్వారానికి ఇరు గణపతి, శ్రీ కుమారస్వామి, శ్రీ వీరభద్రుడు, శ్రీ భద్రకాళీ పక్కలా ద్వారపాలకులు ఉంటారు. అర్థమండపంలో శ్రీ ..అమ్మవారు దర్శనమిస్తారు.గర్భాలయంలో నర్మద లింగరూపంలో శ్రీ గంగా భ్రమరాంబ
సమేత శ్రీ మల్లేశ్వర స్వామి వారుచందన విభూతి, కుంకుమ లేపనలతో, రమణీయ పుష్ప
అలంకరణలో నాగాభరణం ధరించి నేత్రపర్వంగా దర్శనమిస్తారు. శ్రీశైలంలో ఆకాశ గంగ ఉంటుంది. కానీ మోర్జంపాడు శివయ్య పక్కన పాతాళ గంగ కనపడుతుంది. లింగరాజు పక్కన కొలువైన గంగమ్మ ఎక్కడి నుండి వస్తుందో తెలియదు.
కానీ సర్వకాల సర్వావస్థలయందు స్వచ్ఛమైన నీరు ఆ చిన్న గుంటలో కనపడుతుంది. ఎంత తీసినా తరగదు. ఉదయం
తొమ్మిది గంటల లోపల భక్తులు స్వయంగా శీశైలంలో లభించే స్పర్శ దర్శనం మాదిరి స్వామివారికి అభిషేకం చేసుకొనే అద్భుత అవకాశం ఇక్కడ లభిస్తుంది. పక్కనే నీటి బుగ్గ
ఉండటం వలన స్వామిని ‘బుగ్గమల్లేశ్వరుడు’ అని స్థానికులుపిలుస్తుంటారు.
ఉత్స వాలు
ప్రతిరోజు ఆలయం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు తెరిచి ఉంటుంది. ఆ తరువాత కూడా
దర్శనం లభిస్తుంది. కానీ అభిషేక అర్చనాదులకు అవకాశం లేదు. ఈ ఆలయంలో మహా శివరాత్రి పర్వదినాన్ని అత్యంత ఘనంగా నిర్వహిస్తారు.
ప్రతిరోజు దూర ప్రాంతాల నుండి
వచ్చే భక్తుల కోసం దాతల సహకారంతో అన్న ప్రసాదం ఏర్పాటు చేశారు. శివ దీక్ష సమయంలో పెద్ద సంఖ్యలో దీక్ష తీసుకొన్న భక్తులు వస్తుంటారు.
పలనాటి శ్రీశైలం
ద్వాదశ జ్యోతిర్లింగ, అష్టాదశ పీఠాలలో ఒకటిగా ప్రసిద్ధికెక్కిన మహా దివ్య తీర్థ పుణ్య క్షేత్రం శ్రీశైలంతో కొన్ని పోలికలు ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. అవి కూడా స్పష్టంగా కనిపించేవి కావడం మరింత అబ్బురంగా అనిపిస్తుంది. శ్రీశైలం మహారణ్యం నల్లమలలో నెలకొని ఉన్నది.
కృష్ణా నది శ్రీశైల క్షేత్రానికి ఉత్తర వాహినిగా ప్రవహిస్తుంది. అక్కడ వెలసిన ఆదిదంపతులు శ్రీ భ్రమరాంబ దేవి సమేత శ్రీ మల్లేశ్వర స్వామి.
అమ్మవారు స్వామివారి ఆలయానికి వెనుక అంటే పడమర వాయువ్యంలో కొంచెం ఎత్తులో ప్రత్యేక సన్నిధిలో కొలువై ఉంటారు. ఆలయ తీర్థాన్ని
‘ఆకాశ గంగ’ అని పిలుస్తారు. ఎన్నో ఉపాలయాలు ఉన్నప్పటికీ శ్రీ వృద్ధ మల్లేశ్వర స్వామి పట్ల భక్తులు చూపే భక్తి ప్రత్యేకమైనది. దరిదాపుగా ఇవే మోర్జంపాడు శివాలయంలో కనిపిస్తాయి. ఇక్కడ కూడా కృష్ణా నది క్షేత్రానికి ఉత్తర దిశగా ప్రవహిస్తుంది. ఆలయం అటవీ ప్రాంతంలో ఊరికి దూరంగా ఉంటుంది.
తూర్పు ముఖంగా ఉండే ఈ ఆలయ ప్రాంగణం విశాలంగా కనపడుతుంది.
శ్రీ మల్లేశ్వర స్వామి వారి సన్నిధి పక్కనే ఉన్న మరో సన్నిధిలో శ్రీ వృద్ధ మల్లేశ్వర స్వామి
దర్శనమిస్తారు. శ్రీశైలంలో మాదిరి అమ్మవారు ప్రధాన ఆలయానికి వెనుక పక్కన వాయువ్య దిశలో
ఎత్తైన ప్రదేశంలో ప్రత్యేక సన్నిధిలోదర్శనం ప్రసాదిస్తారు. స్వామివారిగర్భాలయంలో గంగాధరుని పక్కనే పాతాళ గంగ ఉండటం అత్యంత ముఖ్య విషయం.
అందువల్ల శ్రీభ్రమరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి కొలువైన మోర్జంపాడు పలనాటి శ్రీశైలంగా ప్రసిద్ధి. శ్రీశైలం వెళ్లలేనివారు ఈ క్షేత్రానికి వస్తుంటారు. గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం, శ్రీ ఆంజనేయస్వామి
మందిరం నెలకొని ఉన్నాయి. ఇన్ని విశేషాల శ్రీ గంగా భ్రమరాంబ సమేత బుగ్గ మల్లేశ్వర
స్వామి కొలువు తీరిన మోర్జంపాడు, గుంటూరు నుండి హైదరాబాద్ వెళ్లే దారిలో వచ్చే పిడుగురాళ్ల పట్టణానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పిడుగురాళ్లకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుండి చేరుకోడానికి రైలు, బస్సు సౌకర్యం లభిస్తుంది. స్థానికంగా అందుబాటు ధరలలో వసతి సౌకర్యాలు లభిస్తాయి.































