ఒడిశాలో ఇవాళ ఓ ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. సుందర్ ఘడ్ జిల్లాలోని రూర్కెలా ఎయిర్ స్ట్రిప్ కు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. 9 సీటర్లు కలిగిన ఈ విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కుప్పకూలింది.
సాంకేతిక కారణాలతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన కాసేపటికే సహాయక బృందాలు అక్కడికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టాయి. దీంతో పెను ప్రమాదం తప్పినట్లయింది.
ఇండియా వన్ ఎయిర్ సంస్థకు చెందిన ఈ చిన్న విమానం ప్రమాదానికి గురైన సమయంలో ఆరుగురు ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు అందులో ఉన్నారు. అయితే పైలట్లు చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ఫ్లైట్ లో ప్రయాణిస్తున్న వారు గాయాలతో తప్పించుకున్నారు. విమానం టేకాఫ్ కాగానే సాంకేతిక లోపం ఎదురుకావడంతో అదుపు తప్పి ఇలా కుప్పకూలినట్లు సమాచారం.
ఘటన జరిగిన వెంటనే అత్యవసర ప్రతిస్పందన బృందాలు ప్రమాద స్థలానికి చేరుకున్నాయి. గాయపడిన ప్రయాణీకులు , సిబ్బందిని తక్షణ వైద్య సాయం కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అందరూ ప్రమాదం నుండి బయటపడ్డారని , ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. డిప్యూటీ ఫైర్ ఆఫీసర్ ఉమాకాంత నాయక్ మాట్లాడుతూ.. ఈ విమానం భువనేశ్వర్ నుండి రూర్కెలాకు వస్తోందని, ఏటీసీతో కనెక్షన్ తెగిపోయి కాసేపు జాడ తెలియలేదని వెల్లడించారు. చివరికి విమానం అత్యవసరంగా ల్యాండ్ అయిందని తెలిసిందన్నారు. ఇందులో ఉన్న నలుగురు ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది గాయపడినట్లు తెలిపారు. విమానాన్ని సురక్షితమైన ప్రదేశంలో ల్యాండ్ చేసినందుకు పైలట్‌కు ధన్యవాదాలు తెలిపారు.

































