గుంటూరు జిల్లాలోని కాజా నుంచి కృష్ణా జిల్లాలోని పెదఅవుటుపల్లి వరకు నిర్మించిన బైపాస్ రోడ్డును అందుబాటులోకి తెచ్చారు.
విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డు ప్రారంభం
ఈ రహదారిలో ఒక వైపును మాత్రమే ప్రస్తుతం వాహనాలకు అనుమతించారు. నేడు సంక్రాంతి పర్వదినాన ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు శాస్త్రోక్తంగా పూజలు చేసి బైపాస్‌ను ప్రారంభించారు. తొలుత వారి వాహనాలు, ఆపై సాధారణ వాహనాలకు అనుమతి ఇవ్వగా వాహనాలు ఒకవైపు నడుస్తున్నాయి. మార్చిలోపు రెండోవైపు రహదారిని కూడా పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తామని అధికారులు చెప్తున్నారు.
విజయవాడ ట్రాఫిక్ లో చిక్కుకోకుండా ప్రయాణాలు
ఈ బైపాస్‌తో చెన్నై, గుంటూరు మార్గంలో రహదారిపై రద్దీ కాస్త తగ్గుతుంది. విజయవాడ ట్రాఫిక్ లో చిక్కుకోకుండా ప్రయాణాలు సాగించే అవకాశం ఉంటుంది. దీనివలన చెన్నై, గుంటూరుల నుండి వచ్చే వాహనాలకు ప్రయోజనం చేకూరనుంది. కాజా టోల్‌గేట్ దాటి బైపాస్‌లోకి వచ్చి గొల్లపూడి మీదుగా చిన్నఅవుటపల్లి వరకు వెళ్లి ఏలూరు హైవేలోకి కలవవచ్చు. గుంటూరు నుండి హైదరాబాద్ వెళ్లే వాహనాలు గొల్లపూడి వద్ద విజయవాడ-హైదరాబాద్ హైవేలోకి ప్రవేశించవచ్చు.
ప్రస్తుతం ఆ మార్గంలో నో జర్నీ
దీనివల్ల విజయవాడ నగరంలోకి రాకుండానే ఏలూరు, హైదరాబాద్‌లను చేరుకునే అవకాశం లభించింది. అయితే, గొల్లపూడి వైపు నుండి కాజా వరకు బైపాస్‌లో ప్రస్తుతానికి ప్రయాణానికి అవకాశం లేదని NHAI అధికారులు తెలిపారు. ఇంకా పనులు జరుగుతున్నందున, గొల్లపూడి నుండి వచ్చే వాహనాలు కృష్ణా నదిపై వంతెన, సీడ్ యాక్సెస్ రోడ్డు, మంగళగిరి-మందడం రోడ్డు మీదుగా సచివాలయం, హైకోర్టుల వైపు వెళ్లాలని సూచించారు.
విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే బెనిఫిట్
పూర్తి రహదారి అందుబాటులోకి వచ్చిన తర్వాతే వెంకటపాలెం వద్ద టోల్‌ఫీజు వసూలు చేస్తామని వారే స్పష్టం చేశారు. మొత్తంగా విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే విజయవాడ నగరంలోకి వెళ్ళకుండా బైపాస్ లో ప్రయాణం సాగించే అవకాశం ఉంటుంది. నేడు ఈ మార్గం అందుబాటులోకి రావటంతో ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు




































