దేశంలో మనం ఎక్కడికి వెళ్లినా.. ఏ పని కోసం వెళ్లినా.. ఏది కావాలన్నా అడిగేది ఆధార్ కార్డు మాత్రమే. ఆధార్ కార్డు ఉంటేనే భారతీయుడిగా దేశంలో పరిగణిస్తారు.
అలా దేశవ్యాప్తంగా కోట్ల మందికి ఆధార్ కార్డు ఓ నిత్య గుర్తింపు కార్డుగా భావిస్తారు. ఆధార్ కార్డు అటు విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు, బడుగు బలహీన వర్గాల ప్రజలు, చిన్నారులు.. ఇలా ఎంతో మందికి వెన్నెముక గా నిలించింది. సంక్షేమ పథకాల్లో ఆధార్ కార్డు ప్రామాణికంగా భావిస్తారు.
అయితే ఆధార్ కార్డుతో పాటు పెద్ద నోట్ల రద్దు తర్వాత కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యూపీఐ సేవలకు కూడా జనాధరణ పెరిగింది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ యూపీఐ వాడుతున్నారు. పేమెంట్స్ చేస్తున్నారు. డిజిటల్ ఎకానమీలో యూపీఐ కీలక పాత్ర పోషిస్తోంది. క్యాష్ లెస్ లావాదేవీలు గతంలో కంటే భారీగా పెరిగాయి. అయితే యూపీఐ, ఆధార్ తరహాలో మరో కొత్త సదుపాయాన్ని దేశ ప్రజల ముందుకు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సమాయత్తం అవుతోంది.
‘డిజిటల్ అడ్రస్’ పేరుతో ఈ సరికొత్త విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తోంది. సర్వీస్ డెలివరీ, డేటా సెక్యూరీటీ కోసం ఈ విధానాన్ని ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. ప్రజల చిరునామాను భద్రపరుస్తూ.. అటు ప్రభుత్వ, ఇటు ప్రైవేటు సంస్థలకు ఒక ప్రూఫ్ గా ఈ డిజిటల్ అడ్రస్ విధానాన్ని తీసుకురానుంది. కేంద్ర పోస్టల్, పీఎమ్ఓ శాఖ ఈ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
డిజిటల్ అడ్రస్ విధానం ద్వారా భారత్ ను డిజిటల్ పబ్లిక్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ మాట్రిక్(DPI)లోకి తీసుకెళ్లేందుకు సిద్ధం అవుతోంది. ప్రస్తుతం అన్ని రంగాల్లో డిజిటలైజేషన్ పెరిగిపోయిన కారణంగా డిజిటల్ అడ్రస్ విధానం కూడా అందుబాటులోకి తీసుకురానుంది. డిజిటల్ అడ్రస్ విధానం ద్వారా రెండు ముఖ్యమైన ఉపయోగాలు ఉన్నాయి.
ఒకటి.. ప్రభుత్వ, ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు మన అడ్రస్ ను అత్యంత భద్రతగా పంపించవచ్చు. ప్రజల చిరునామాకు భద్రతగా ఉంటుంది. రెండోది.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ ఫలాలు అర్హులైన పేదలకు చేరే విధంగా వాళ్ల అడ్రస్ ను భద్రపరుస్తుంది. దీంతో దళారీలు, ఇతర శక్తుల్లోకి సంక్షేమ పథకాలు వెళ్లకుండా నేరుగా ప్రజల చెంతకే పథకాలు చేరతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈమేరకు ప్రధానమంత్రి కార్యాలయం డిజిటల్ అడ్రస్ పై ఓ ఫ్రేమ్ వర్క్ ప్రారంభించినట్లు సమాచారం. ఈ కార్యక్రమాన్ని త్వరలోనే ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
































