కళ్లకు గంతలు కట్టుకుని పరీక్ష రాసిన విద్యార్థిని.. ఆమె రహస్యం తెలిస్తే అవాక్కే..

ప్రస్తుత కాలంలో పరీక్ష రాయడానికే విద్యార్థులు ఎంతో కష్టపడుతుంటారు. అలాంటిది కళ్లకు గంతలు కట్టుకుని పరీక్ష రాయడం అంటే మాటలు కాదు. అయితే కర్ణాటకలోని బళ్లారికి చెందిన ఒక విద్యార్థిని అసాధారణమైన ప్రతిభను ప్రదర్శించి అందరినీ ఆశ్చర్యపరిచింది.


బళ్లారిలోని కురవల్లి తిమ్మప్ప మెమోరియల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో ఎనిమిదో తరగతి చదువుతున్న హిమబిందు అనే విద్యార్థిని సోషల్ సైన్స్ పరీక్షను కళ్లకు గంతలు కట్టుకుని రాసి వార్తల్లో నిలిచింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో అనేక సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కళ్ల గంతలతో అద్భుతం

హిమబిందు ముందుగా కళ్లకు కాటన్ పెట్టుకుని, ఆపై దానిపై నల్లటి గుడ్డను కట్టుకుని పరీక్ష రాసింది. ఈ అద్భుతమైన ఘనత సాధించినందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆమెను ప్రశంసించారు.
ఉపాధ్యాయులు చెప్పిన వివరాల ప్రకారం.. హిమబిందు కళ్లు మూసుకుని కూడా ఫోటోలను త్వరగా గుర్తించగలదు. ప్రధాని నరేంద్ర మోదీ, ఆంజనేయస్వామి వంటి వారి ఫోటోలను ఆమె వెంటనే గుర్తుపట్టగలదు. టెక్నాలజీలోనూ ఆమె ముందుంది. కళ్లు మూసుకుని తన మొబైల్ ఫోన్‌లో అక్షరాలను ఆమె వెంటనే చెప్పగలదు.

రహస్య మంత్రం, మూడో కన్ను విద్య

11 ఏళ్ల వయస్సు నుంచే ఈ విద్యలో ప్రావీణ్యం సంపాదించిన హిమబిందు తన ఈ పరీక్షలన్నింటినీ కళ్లకు గంతలు కట్టుకుని రాయాలని నిర్ణయించుకుంది. ఈ అసాధారణ సామర్థ్యం గురించి ఆమె ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ”నేను చిన్నప్పటి నుంచి కళ్లకు గంతలు కట్టుకుని రాయడం ప్రాక్టీస్ చేస్తున్నాను. పరీక్ష రాసే ముందు, నేను ఒక రహస్య మంత్రాన్ని పఠిస్తాను, అది ఎవరికీ చెప్పను. మొత్తం 25 కార్యక్రమాల్లో పాల్గొని అవార్డులు అందుకున్నాను. నా గురువు నాకు ఈ జ్ఞానాన్ని ఇచ్చారు. ప్రాణాయామం ద్వారా నేను నా మూడవ కన్ను ద్వారా ప్రతిదీ అర్థం చేసుకోగలను” అని చెప్పింది.

పాఠశాల అనుమతితోనే..

చిన్నప్పటి నుంచే ఈ గాంధారి విద్యను అభ్యసిస్తున్న హిమబిందు సాధనకు ఆమె ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పూర్తిగా మద్దతు ఇచ్చారు. ఆమె ఎనిమిదో తరగతి చదువుతుండటం వల్ల పాఠశాల యాజమాన్య బోర్డు అనుమతితో కళ్లకు గంతలు కట్టుకుని పరీక్ష రాసే అవకాశం లభించింది. అయితే టెన్త్ పబ్లిక్ పరీక్షలను ఇలా రాయడానికి అనుమతి లేదని పాఠశాల వర్గాలు స్పష్టం చేశాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.