సిమ్, టవర్ అవసరం లేని టెక్నాలజీ.. అందుబాటులోకి వచ్చేది అప్పుడే..

మొబైల్‌లో కాల్ చేయాలంటే ఏమి ఉండాలి.. సిమ్ కార్డు, ఆ సిమ్ కు కాల్స్ సిగ్నల్ రావాలంటే సెల్ టవర్ ఈ రెండు తప్పనిసరి. ఇప్పటి వరకు మనం ఈ రెండింటిపైనే ఆధారపడ్డాం..


కానీ ఇప్పుడు అదే సూత్రాన్ని తలకిందులు చేసే సాంకేతిక విప్లవం నెమ్మదిగా ప్రపంచం ముందు నిలుస్తోంది. సిమ్ కార్డు లేకుండా, సెల్ టవర్ అవసరం లేకుండానే మొబైల్‌కు కాల్స్, మెసేజ్‌లు, ఇంటర్నెట్ అందించే ‘డైరెక్ట్-టూ-కాల్ శాటిలైట్’. ఇది భవిష్యత్తు కాదు.. ఇప్పుడే మొదలవుతున్న వాస్తవం. ఈ టెక్నాలజీ రిమోట్ ఏరియాల కోసం గేమ్ చేంజర్‌గా మారబోతోందని నిపుణులు చెబుతున్నారు.

దూర ప్రాంతాలకు దూరం..

ఇప్పటి వరకు మొబైల్ నెట్‌వర్క్ ఎలా పనిచేస్తుందంటే భూమిపై ఉన్న సెల్ టవర్ల నుంచి సిగ్నల్ వస్తుంది. కొండలు, అడవులు, ఎడారులు, సముద్రం మధ్యలోకి వెళ్తే ఆ సిగ్నల్ కట్ అవుతుంది. అందుకే గ్రామాలు, సరిహద్దు ప్రాంతాలు, ద్వీపాలు, పర్వత ప్రాంతాల్లో ఇంకా ‘నో నెట్‌వర్క్’ సమస్య కొనసాగుతోంది. కానీ డైరెక్ట్-టు-కాల్ ( Direct-to-Cell) టెక్నాలజీలో మీ మొబైల్ ఫోన్ నేరుగా ఆకాశంలో ఉన్న శాటిలైట్‌తో కనెక్ట్ అవుతుంది. మధ్యలో టవర్లు అవసరం ఉండవు. మీ జేబులో ఉన్న అదే ఫోన్.. అదే నంబర్.. అదేగా పనిచేస్తుంది.

విప్తవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టిన కంపెనీలు..

ఈ విప్లవాత్మక మార్పును స్టార్ లింక్ (Starlink), టీ మొబైల్ (T-Mobile), ఏటీ అండ్ టీ (AT&T) లాంటి సంస్థలు ఉన్నాయి. స్టార్‌లింక్ ఇప్పటికే వేల సంఖ్యలో లో ఎర్త్ ఆర్బిట్ (లియో) శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపింది. ఈ శాటిలైట్లు భూమికి దగ్గరగా ఉండడం వల్ల లేటెన్సీ తక్కువగా ఉంటుంది. అదే సమయంలో, టీ-మొబైల్ లాంటి టెలికాం కంపెనీలతో కలిసి, సాధారణ స్మార్ట్‌ఫోన్‌లకే డైరెక్ట్ కనెక్టివిటీ అందించే దిశగా అడుగులు వేస్తోంది.

5G మొబైల్స్ లో అందుబాటులోకి..

ఈ టెక్నాలజీ ప్రత్యేకత ఏమిటంటే కొత్త ఫోన్ కొనాల్సిన అవసరం లేదు. పెద్ద యాంటెన్నాలు, భారీ డిష్‌లు అవసరం ఉండవు. ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న చాలా 4G, 5G స్మార్ట్‌ఫోన్‌లు ఈ సేవను సపోర్ట్ చేసేలా డిజైన్ అవుతున్నాయి. మొదట దశలో టెక్స్ట్ మెసేజ్‌లు, ఎమర్జెన్సీ అలర్ట్స్, కాల్స్ అందుబాటులోకి వస్తాయి. తర్వాత దశల్లో ఇంటర్నెట్ డేటా కూడా అందించే లక్ష్యం ఉంది. అంటే అడవిలో చిక్కుకున్న ట్రెక్కర్ అయినా, సముద్రంలో ప్రయాణిస్తున్న మత్స్యకారుడైనా, ఎడారిలో పనిచేస్తున్న కార్మికుడైనా కనెక్టివిటీకి దూరమయ్యే పరిస్థితి ఉండదు.

రిమోట్ ఏరియాలపై తీవ్ర ప్రభావం..

రిమోట్ ఏరియాలపై దీని ప్రభావం అసాధారణం. ఇప్పటి వరకు నెట్‌వర్క్ లేని గ్రామాల్లో డిజిటల్ సేవలు అందించాలంటే కోట్ల రూపాయల పెట్టుబడితో టవర్లు నిర్మించాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ అవసరం తగ్గుతుంది. విద్య, టెలిమెడిసిన్, ఆన్‌లైన్ బ్యాంకింగ్, ప్రభుత్వ సేవలు అన్నీ మారుమూల ప్రాంతాలకు అందుబాటులోకి వస్తాయి. ప్రకృతి విపత్తుల సమయంలో ఇది మరింత కీలకంగా మారుతుంది. భూకంపం, వరదలు, తుఫాన్లలో సెల్ టవర్లు పడిపోయినా, శాటిలైట్ నెట్‌వర్క్ పనిచేస్తూనే ఉంటుంది. అత్యవసర సమాచార మార్పిడికి ఇది ప్రాణ రక్షకంగా మారుతుంది.

భద్రతా రంగంలో భారీ మార్పులు..

భద్రతా రంగంలోనూ ఈ టెక్నాలజీ కీలక పాత్ర పోషించనుంది. సరిహద్దు ప్రాంతాల్లో సైన్యం, పారా మిలిటరీ దళాలకు నిరంతర కమ్యూనికేషన్ అందుతుంది. నిఘా, రియల్ టైమ్ డేటా షేరింగ్ మరింత బలపడుతుంది. అదే సమయంలో, ఇది సైబర్ భద్రత, ప్రైవసీ వంటి కొత్త ప్రశ్నలను కూడా తెరపైకి తెస్తోంది. శాటిలైట్ ఆధారిత కమ్యూనికేషన్‌ను ఎవరు నియంత్రిస్తారు? డేటా ఎవరి పరిధిలో ఉంటుంది? ప్రభుత్వాలు ఎలా నియంత్రిస్తాయి? ఇవన్నీ రాబోయే రోజుల్లో పెద్ద చర్చలుగా మారతాయి.

భారత్ వంటి దేశాలకు ఇది భారీ అవకాశంతో పాటు సవాలుగా కూడా నిలుస్తుంది. ఒకవైపు దూర ప్రాంతాలకు కనెక్టివిటీ పెరగడం డిజిటల్ ఇండియా లక్ష్యాలకు బలమిస్తుంది. మరోవైపు, విదేశీ శాటిలైట్ నెట్‌వర్క్‌లపై ఆధారపడడం వ్యూహాత్మక ఆందోళనలను కలిగించవచ్చు. అందుకే దేశీయ శాటిలైట్ కమ్యూనికేషన్ సామర్థ్యాలను కూడా సమాంతరంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది.

మొత్తానికి, డైరెక్ట్-టే-కాల్ శాటిలైట్ టెక్నాలజీ మొబైల్ కమ్యూనికేషన్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తోంది. ‘సిగ్నల్ ఉందా?’ అనే ప్రశ్న త్వరలో ప్రశ్నగానే మిగిలిపోయే రోజులు ఎంతో దూరంలో లేవు. ఆకాశమే టవర్‌గా మారే ఈ యుగంలో, కనెక్టివిటీ ఒక లగ్జరీ కాదు మౌలిక హక్కుగా మారబోతోంది. భూమి చివరి మూలలో ఉన్న వ్యక్తికీ అదే డిజిటల్ ప్రపంచాన్ని అందించాలన్న ఆశయానికి ఈ టెక్నాలజీ నిజమైన దారి చూపుతోంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.