ప్రేమ ఎంతో పవిత్రమైనది చెప్తుంటారు. ఇప్పుడున్న ప్రేమ గురించి కాస్త పక్కన పెడితే.. మనసారా ఇష్టపడి, వారితోనే జీవితాన్ని పంచుకోవాలనుకునే ఏ ప్రేమికులైనా ఈ ఆలయానికి వెళ్లి శివపార్వతులను దర్శించుకుంటే వారి ప్రేమ సక్సెస్ అవుతుందని నమ్మకం.
తమిళనాడులోని తిరుశక్తిమట్టం అనే ప్రాంతంలో ఉన్న శక్తివనేశ్వర ఆలయం ప్రేమ బంధాలను ముడివేసే దైవ క్షేత్రంగా ప్రసిద్ధి గాంచింది. ఇందుకు గల కారణం ఈ ఆలయానికి ఉన్న పురాణ కథ.
కుంభకోణంకు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయంలో పార్వతీదేవి శివుడి కోసం తీవ్రమైన తపస్సు చేసి, అగ్ని రూపంలో ఉన్న శివుడిని ఆలింగనం చేసుకుని తన ప్రేమను తెలియజేసినట్లు పురాణాలు చెప్తున్నాయి. స్థానికులు కూడా ఈ పురాణ కథను నమ్ముతున్నారు. ఆమె ప్రేమను మెచ్చిన శివయ్య.. సగౌరవంగా పార్వతీదేవిని భార్యగా స్వీకరించాడని చెప్తుంటారు. అలాంటి ఈ ఆలయానికి వెళ్లిన ప్రేమికులు.. శివపార్వతులను కలిపి దర్శించుకుంటే ఎప్పటికీ విడిపోరని, వారి ప్రేమ సక్సెస్ అయి కలిసి ఉంటారని నమ్మకం. అందుకే ఈ ఆలయంలో ఎక్కువగా ప్రేమ జంటలు కనిపిస్తాయి. పెళ్లి బంధంలోకి అడుగు పెట్టేవారు సైతం తమ వైవాహిక జీవితంలో ఎలాంటి కళంకం ఉండకూడదని ఈ ఆలయానికి విచ్చేసి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఇక్కడి శివలింగం కాస్త భిన్నంగా కనిపిస్తుంది. పార్వతీదేవి శివలింగాన్ని హత్తుకున్నట్లు కనిపిస్తుంది.
































