ఏపీలో ఘోర ప్రమాదం.. రియాక్టర్ పేలి ఆరుగురు దుర్మరణం.. 14 మందికి తీవ్ర గాయాలు

www.mannamweb.com


అనకాపల్లిజిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా కంపెనీలో రియాక్టర్ పేలి భారీ అగ్నిప్రమాదం జరిగింది. రియాక్టర్‌ పేలిన ఘటనలో ఇప్పటివరకు ఆరుగురు కార్మికులు మృతిచెందారు..

14 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. బాధితులను హుటాహుటిన అనకాపల్లిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఎసెన్సియా కంపెనీలో ఉద్యోగులు, కార్మికులంతా రోజువారిగానే పని చేస్తున్నారు. మధ్యాహ్న సమయంలో ఒక్కసారిగా రియాక్టర్ పేలింది. దీంతో దాదాపు 18 మంది వరకు గాయపడ్డారు. వీరిలో ఆరుగురు కార్మికులు మృతిచెందారు. మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయియాయి..

ఎసెన్షియా కంపెనీలో మధ్యాహ్నం సమయంలో రియాక్టర్ పేలి భారీగా మంటలు ఎగసిపడ్డాయి. పెద్ద శబ్దాలతో పేలుడు జరగడంతో కొంతమంది బయటకు వచ్చారని, లేకుంటే మరింత ఘోరం జరిగేదని కార్మికులు చెప్తున్నారు. ప్రమాదంతో ఫార్మా కంపెనీ పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ అలుముకుంది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.. ఎన్డీఆర్ఎఫ్ బందం రంగంలోకి దిగింది.. గాయపడిన వారిని అనకాపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

ఫార్మా కంపెనీలో ప్రమాదంపై సీఎం చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు.. గాయపడిన వారికి అత్యాధునిక వైద్యం అందించాలని సూచించారు. ఫార్మా కంపెనీలో ప్రమాదంపై హోంమంత్రి అనిత ఆరా తీశారు. జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని సూచించారు.