సర్కార్ బడి టీచర్లకు అగ్ని పరీక్ష.. సుప్రీం తీర్పుతో కొత్త టెన్షన్

రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయుల కొత్త టెన్షన్ పట్టుకుంది. పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు పుస్తకాలతో కుస్తీ పట్టే పరిస్థితి ఏర్పడింది.


రోజు పిల్లలకు పాఠాలు చెప్పే టీచర్లు ఇప్పుడు టెట్ పాఠాలు వింటున్నారు. ప్రస్తుతం టెట్ (ఉపాధ్యాయ అర్హత పరీక్ష) టెన్షన్‌తో సతమతమవుతున్నారు. ఉద్యోగంలో ఉన్నప్పటికీ తాజా నిబంధనల ప్రకారం టెట్ క్వాలిఫై కావడం తప్పనిసరి కావడంతో 45,742 వేల మంది టీచర్లు ఈ పరీక్షకు సిద్ధం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, పరీక్షకు కేవలం 45 రోజుల సమయం మాత్రమే ఉండటం, సిలబస్‌లో తాము బోధించని ఇతర సబ్జెక్టులు కూడా ఉండటంతో మెజారిటీ ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పరీక్షలకు కేవలం నెలన్నర సమయం మాత్రమే మిగిలి ఉంది. జనవరి 16 నుంచి ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. పైగా, వీరు విధులు నిర్వహిస్తూనే ఈ పరీక్షకు ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. విధుల్లో ఆలస్యం, కుటుంబ బాధ్యతల మధ్య ఈ తక్కువ టైంలో క్వాలిఫై అయ్యేంతగా సిద్ధం కావడం కష్టమని పలువురు టీచర్లు వాపోతున్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు టెట్ తప్పనిసరి అని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది.. దీంతో రాష్ట్రంలోని సుమారు 45 వేల మంది టీచర్లు ప్రభావితం కానున్నారు. కొత్త నియామకాలకు మాత్రమే కాకుండా, పదోన్నతులకు కూడా టెట్ అర్హత తప్పనిసరి కావడంతో ప్రస్తుతం విధుల్లో ఉన్న ఉపాధ్యాయులు టెట్ పరీక్షకు సన్నద్ధమవుతున్నారు. టెట్ క్వాలిఫై కావడం తప్పనిసరి కావడంతో గతంలో డీఎస్సీ ద్వారా నియమితులై, టెట్ నుంచి మినహాయింపులేని టీచర్లు అంతా దీని పరిధిలోకి వస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ సంఖ్య 45,742లుగా ఉన్నది. వీరంతా టెట్ క్వాలిఫై కాకపోతే వారి సర్వీస్ విషయం లేదా ప్రమోషన్ల విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. 2011లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, తెలంగాణ ఏర్పడిన తర్వాత 2015లో రూపొందించిన టెట్ నిబంధనల్లో.. 2010 నాటికి ముందు నియమితులైన టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇచ్చినట్లు ఉపాధ్యాయ సంఘాలు తెలుపుతున్నాయి. సాధారణంగా టెట్ పరీక్షలో ఉత్తీర్ణత శాతం తక్కువగా ఉంటుంది. తాజాగా బీఈడీ పూర్తి చేసిన అభ్యర్థుల్లోనే తక్కువగా పాసవుతున్నారు.

అలాంటిది టీచర్లు దశాబ్దాల క్రితం సర్వీస్లో చేరారు. అప్పటి సిలబస్ వేరు. ఇప్పుడున్నది వేరు. విద్యా విధానంలోనే అనేక మార్పులు వచ్చాయి. ముఖ్యంగా విద్యార్థుల సైకాలజీ, నవీన విద్యావిధానం నుంచి టెట్లో ప్రశ్నలు ఇస్తారు. వీటిపై ఇన్ సర్వీస్లో ఉన్న టీచర్లకు అవగాహన తక్కువే..అదీగాక సైన్స్ టీచర్గా పనిచేస్తున్న వ్యక్తి కేవలం తన సబ్జెక్టుపైనే దృష్టి పెడతాడు. గణితం కూడా టెట్ సిలబస్ ఉంటుంది. దీంతో ఇతర సబ్జెక్టులు రాయడం ఇబ్బందిగా ఉంటుందని చెబుతున్నారు టీచర్లు.. మారిన సిలబస్, బోధన విధానాలకు అనుగుణంగానే కొన్నేళ్లుగా ప్రశ్నపత్రాన్ని రూపొందిస్తున్నారు. కొత్తగా టెట్‌కు సన్నద్ధం అవుతున్న యువతకు కంప్యూటర్ పరిజ్ఞానం ఎక్కువగా ఉంటుంది. ప్రశ్నలను వెతుక్కుని తేలికగా ప్రిపేర్ అవుతారు. సర్వీస్ టీచర్లకు ఈ అవకాశం తక్కువ. ఇవన్నీ సర్వీస్ టీచర్లలో వణుకు పుట్టిస్తున్నాయి.

మినహాయింపు ఇవ్వండి: టీచర్లు

టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వమే సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసిందన్నారు టీచర్ ఎమ్మెల్సీలు, ఉపాధ్యాయ సంఘాలు నేతలు. టెట్ పై కేంద్ర విద్యా శాఖ మంత్రులతో పాటు కేంద్ర మంత్రులను కలుస్తునామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధ్యాయులకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరుతున్నారు. గత 15 ఏళ్లుగా సర్వీస్ టీచర్లకు టెట్ అవసరం లేదని ప్రభుత్వాలే చెప్పాయన్నారు టిచర్ ఎమ్మెల్సీలు, ఉపాధ్యాయ సంఘాలు నేతలు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి 2011కు ముందున్న టీచర్లకు టెట్ అవసరం లేదనే నిర్ణయం తీసుకోవాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాస్తవ పరిస్థితులను బలంగా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లి సర్వీస్ టీచర్లకు న్యాయం చేయాలనీ కోరుతున్నారు టీచర్స్ ఎమ్మెల్సీలు. టెట్ కోసం అనేక మంది టీచర్లు సెలవులు పెట్టారు.తాము పాఠాలు చెప్పిన విద్యార్థుల వద్దే పాఠాలు నేర్చు కొంటున్నారు.. టెట్ను దృష్టిలో ఉంచుకుని కొన్ని కొని కేంద్రాలు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నాయి. జనవరిలో టెట్ పరీక్ష నిర్వహణకు విద్యాశాఖ.. ఇప్పటికే నోటిఫికేషన్ ఇవ్వడంతో టీచర్లలో టెట్ గుబులు మరింత పెరిగింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.