వందల మంది నివాసం ఉండే గ్రామం.. పొద్దుపొడిచేసరికి అందరూ మాయం

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని విలాసాగర్ గ్రామంలో గత కొద్ది రోజులుగా ఒకరు మృతి చెందిన వెంటనే వారి.. దశదినకర్మలు పూర్తికాకుండానే మరొకరు మృతి చెండుతున్నారు.


దాదాపు గ్రామానికి చెందిన 11 మంది వరకు ఇటీవల మృతి చెందారు. దీంతో గ్రామానికి ఏదో కీడు సోకిందని స్థానికులు భయపడుతున్నారు. కీడు పోవాలంటే గ్రామస్తులందరూ ఊరు విడిచి వెళ్లి కీడు వంటలు వండుకోవాలని పెద్ద మనుసులు చెప్పారు. దీంతో.. గ్రామస్తులు.. ఒక్కరోజు గ్రామం వదిలి పెట్టి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. ఇంకేముంది అందరూ ఉదయం 6 గంటలకు..ఇళ్లకు తాళం వేసి..పొలం బాట పట్టారు. గ్రామంలోని ప్రతి ఒక్కరు చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ కలిసి మానేరు పరివాహక ప్రాంతంలో కీడు గంటలకు వెళ్లారు.

ఉదయం 6 గంటల నుండి సాయంత్రం చీకటి పడేంత వరకు అక్కడే గ్రామస్తులంతా కుటుంబ సభ్యులతో కలిసి వివిధ రకాల వంటకాలను వండుకొని తిన్నారు. ఎవరు కూడా మధ్యలో మళ్ళీ గ్రామంలోకి వెళ్ళవద్దని నిర్ణయం తీసుకున్నారు.. కుటుంబ సభ్యులు మొత్తం.. పొలాల వద్దనే గడిపారు. కీడు సోకడం వల్ల గ్రామంలో ఒకరి తర్వాత ఒకరు చనిపోతున్నారని.. కీడు పోవాలంటే గ్రామాన్ని విడిచి కీడు వంటలు చేసినట్లయితే ఆ పీడ పోతుందని తెలియడంతో గ్రామాన్ని వదిలి వచ్చామని స్థానికులు చెబుతున్నారు.. గతంలో ఇదే మాదిరిగా గ్రామానికి కీడు సోకితే కీడు వంటలకు వచ్చామని అప్పుడు బాగానే జరిగిందని వివరించారు. అయితే..ఇలాంటి మూడ నమ్మకాలను నమ్మవద్దని హేతువాదులు చెబుతున్నారు. ఇవన్నీ సహజ మరణాలు అని..ఎలాంటి ఆందోళన చెందల్సిన అవసరం లేదని అంటున్నారు. ప్రభుత్వం..ఈ గ్రామంలో ప్రజలకు అవగాహన కల్పించి..వారికి వాస్తవాలు వివరించాలని కోరుతున్నారు.
ఏది ఏమైనా గ్రామస్తులు అందరూ తెల్లవారుజామునే ఊరు విడిచి వెళ్లడంతో విలాసాగర్ గ్రామం అంతా నిర్మానుషంగా మారింది. ఇప్పుడు ఈ గ్రామం..వార్తల్లో నిలిచింది..