ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు కీలక పదవి ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా ఏబీ వెంకటేశ్వరరావును నియమించింది.
ఈ మేరకు చంద్రబాబు సర్కార్ ఉత్తర్వులు ఇచ్చింది. రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.
జగన్ ప్రభుత్వంలో రెండుసార్లు సస్పెండ్..
ఏబీ వెంకటేశ్వరరావు గతంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేశారు. అయితే, అవినీతి ఆరోపణలతో జగన్ ప్రభుత్వం రెండుసార్లు ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. 2020 ఫిబ్రవరి 2022 ఫిబ్రవరి 7 వరకు ఒకసారి సస్పెండ్ చేసింది. 2022 జూన్ 8 నుంచి 2024 మే 30 వరకు మరోసారి సస్పెండ్ చేసింది. ఈ విధంగా ఆయన తన సర్వీస్ ను కోల్పోయారు.
సస్పెన్షన్ కాలాన్ని విధులు నిర్వహించినట్లుగా క్రమబద్దీకరణ..
కూటమి సర్కార్ వచ్చాక ఏబీ వెంకటేశ్వరరావుకు బిగ్ రిలీఫ్ ఇచ్చేలా నిర్ణయాలు తీసుకుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో సస్పెన్షన్ కాలాన్ని విధులు నిర్వహించినట్లుగా క్రమబద్దీకరించింది. ఇక, సస్పెన్షన్ కాలంలో ఏబీ వెంకటేశ్వరరావుకి ఇవ్వాల్సిన వేతనం, ఇతర అలవెన్సులు చెల్లించాలని స్పష్టం చేసింది. ఇటీవలే ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు కూడా ఇచ్చింది.
ఇప్పుడు ఆయనకు మరో బంపర్ ఆఫర్ కూడా ఇచ్చింది కూటమి సర్కార్. ఏబీకి కీలక పోస్టింగ్ ఇచ్చింది. ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ గా ఏబీ వెంకటేశ్వరరావును నియమించింది.
పదవీ విరమణకు ఒక్కరోజు ముందు పోస్టింగ్..
భద్రత పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారంటూ ఏబీ వెంకటేశ్వరరావుపై అభియోగాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో జగన్ సర్కార్ ఆయనపై రెండు సార్లు సస్పెన్షన్ వేటు వేసింది. దీనిపై ఏబీ కోర్టును ఆశ్రయించారు. న్యాయ పోరాటం చేశారు. ఈ క్రమంలో ఒకసారి పోస్టింగ్ తెచ్చుకున్నారు. రెండోసారి క్యాట్‌ను ఆశ్రయించి ఊరట పొందారు.
అయినప్పటికీ.. అప్పటి వైసీపీ ప్రభుత్వం ఆయనకు పోస్టింగ్ ఇవ్వలేదు. పోస్టింగ్ విషయమై మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు ఏబీ వెంకటేశ్వరరావు. కోర్డు ఆదేశాలతో పదవీ విరమణకు ఒక్కరోజు ముందు పోస్టింగ్ పొందారాయన. ఆ తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వం ఆయనకు ఊరట కల్పించేలా నిర్ణయాలు తీసుకుంది.