రాష్ట్రంలో పాఠశాలలకు ఈ విద్యా సంవత్సరంలో 232 రోజులు పని దినాలుగా ప్రభుత్వం నిర్ణయించింది. సెలవులు 83 రోజులు రానున్నాయి. పాఠశాల విద్యాశాఖకు సంబంధించిన అకడమిక్ కేలండర్‌ను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సోమవారం విడుదల చేశారు.
అమరావతి: రాష్ట్రంలో పాఠశాలలకు ఈ విద్యా సంవత్సరంలో 232 రోజులు పని దినాలుగా ప్రభుత్వం నిర్ణయించింది. సెలవులు 83 రోజులు రానున్నాయి. పాఠశాల విద్యాశాఖకు సంబంధించిన అకడమిక్ కేలండర్‌ను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సోమవారం విడుదల చేశారు. గతానికి భిన్నంగా సీఎం, మంత్రి ఫొటోలు లేకుండా రాజకీయాలకు అతీతంగా క్యాలండర్‌ను రూపొందించారు. ఉండవల్లిలోని నివాసంలో అధికారులతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతూ..విద్యాలయాలు రాజకీయాలకు అతీతంగా ఉండాలన్నది ప్రభుత్వ లక్ష్యమని, టీచర్లు, విద్యార్థులకు ఇచ్చే శిక్షణ దీపికల్లోనూ మంత్రి సందేశం, ఫొటోలు, పార్టీ రంగులు ఉండరాదని ఆదేశించారు. పాఠశాలల తల్లిదండ్రుల కమిటీల పదవీకాలం జులైతో పూర్తవుతున్నందున ఆగస్టులో కమిటీల ఎన్నికలు పూర్తి చేయాలని సూచించారు. పాఠశాలల మధ్యాహ్న భోజనం నాణ్యత, మౌలిక సదుపాయాల మెరుగుదల పర్యవేక్షణ బాధ్యతను తల్లిదండ్రుల కమిటీలకు అప్పగించాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల పరిశుభ్రతకు అవసరమైన రసాయనాలు, ఉపకరణాల కొనుగోలుకు టెండర్లు నిర్వహించాలని సూచించారు. సీబీఎస్ఈ బడుల పనితీరుపై సుదీర్ఘంగా చర్చించిన మంత్రి లోకేశ్ త్వరలో తదుపరి రూట్‌మ్యాప్ ప్రకటిస్తామని పేర్కొన్నారు. కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న బోధన, బోధనేతర పోస్టుల భర్తీకి మంత్రి అనుమతించారు. దీనికి విధివిధానాలు ఖరారు చేయాలని సూచించారు. ఈ సమీక్షలో పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్, డైరెక్టర్ విజయరామరాజు, ఎస్ఎస్ఏ ఎస్పీడీ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
ప్రతి రోజు మొదటి పీరియడ్‌లో 3-7 తరగతులకు చదవడం, రాయడం, అర్థమెటిక్‌లో ప్రాథమిక నైపుణ్యాలు ఉంటాయి. అన్ని తరగతులకు ప్రతివారం చివరి పీరియడ్ ప్రతి సబ్జెక్టుపై పునశ్చరణ తరగతులు ఉంటాయి.
తొమ్మిదోతరగతి వాచకంలో హరివిల్లు, రంగస్థలం, ఉపవాచకంలో కల్లూరి తులసమ్మ, ద్వారబంధాల చంద్రయ్య పాఠాలు బోధించాల్సిన అవసరం లేదు.
సెలవులు ఇలా..
దసరా సెలవులు అక్టోబరు 4 నుంచి 13 వరకు ఉంటాయి. క్రిస్టియన్ మైనారిటీ సంస్థలకు దసరా సెలవుల్లో ఎలాంటి మార్పు లేదు.
మైనారిటీ విద్యా సంస్థలకు క్రిస్మస్ సెలవులు డిసెంబరు 22 నుంచి 29 వరకు ఇస్తారు.
సంకాంత్రి సెలవులు 2025 జనవరి 10 నుంచి 19 వరకు ఉంటాయి. మైనారిటీ విద్యా సంస్థలకు మాత్రం జనవరి 11 నుంచి 15 వరకు ఉంటాయి.
Beta feature