Kinjarapu Atchannaidu: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు.. కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ కార్యకర్తల్లో జోష్ పెంచారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో టీడీపీ కార్యకర్తలు, మద్దతుదారుల పనులు శరవేగంగా పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
ఈ క్రమంలో- ప్రభుత్వ ఉద్యోగులను కించపరిచేలా అచ్చెన్నాయుడు మాట్లాడటం చర్చనీయాంశమౌతోంది. తమ కార్యాలయంలో అడుగు పెట్టిన టీడీపీ కార్యకర్తలను ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు మర్యాదగా చూసుకుంటారని, అలా వారికి తాను ఆదేశాలను జారీ చేస్తారని అన్నారు. మాట వినని ఉద్యోగులు ఎవరైనా ఉంటే వారిని తాను దారిలోకి తెస్తాననీ చెప్పారు.
శ్రీకాకుళంలో పార్టీ నాయకులు, కార్యకర్తల విజయోత్సవ ర్యాలీలో.. పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడితో కలిసి పాల్గొన్నారాయన. అనంతరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటైన సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.
వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో అయిదు సంవత్సరాల పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎన్నో అవమానాలకు గురయ్యారని అన్నారు. ఇప్పుడు తమ ప్రభుత్వం వచ్చినందున సంబరాలు జరుపుకొంటోన్నారని చెప్పారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో ఏ ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లినా టీడీపీ కార్యకర్తల పనులు వేగంగా జరిగేలా తాను సమావేశం పెట్టి అధికారులకు ఆదేశాలు ఇస్తానని అన్నారు.
నేను రాష్ట్ర మంత్రిగా, @RamMNK
కేంద్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత మొదటిసారిగా జిల్లాలో అడుగుతున్న సందర్భంగా వైజాగ్ నుండి నిమ్మాడ వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించడం జరిగింది.. ఈ ర్యాలీకి బ్రహ్మరథం పట్టిన ప్రజలు టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రతి… pic.twitter.com/y0ZtroIAKw— Kinjarapu Atchannaidu (@katchannaidu) June 17, 2024
ఎస్ఈ, ఎమ్మార్వో, ఎండీఓ.. వంటి ఏ అధికారి వద్దకైనా పసుపు బిళ్ల పెట్టుకుని వెళ్లాలని అచ్చెన్నాయుడు టీడీపీ కార్యకర్తలకు సూచించారు. అధికారులు వారికి గౌరవంగా కుర్చీ వేసి, టీ ఇచ్చి, వచ్చిన పని ఏంటని అడిగి మరీ పనులు చేసి పెడతారని అన్నారు. పార్టీ కార్యకర్తలకు అలా పని చేసేలా అధికారులు, ఉద్యోగులను తాను లైన్‌లో పెడతానని హామీ ఇచ్చారు.
ఎవరైనా ఒకరిద్దరు తన మాట వినకపోతే వాళ్లు ఏమౌతారో వారికి బాగా తెలుసునని, తాను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదని అచ్చెన్నాయుడు అన్నారు. దీనికి సంబంధించిన ఓ న్యూస్ ఛానల్ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.