BSNL ప్రస్తుతం శరవేగంగా 4G నెట్‌వర్క్‌ను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా లక్ష 4G టవర్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకొంది.
ఇందులో భాగంగా శరవేగంగా టవర్లను ఏర్పాటు చేస్తోంది. ఈ సంవత్సరం చివరి నాటికి 75 వేల టవర్ల నిర్మాణం చేపట్టాలని భావిస్తోంది. దీంతోపాటు 2025 జూన్ నాటికి 5G నెట్‌వర్క్‌ను ప్రారంభించాలని భావిస్తోంది.
అయితే తాజాగా BSNL కొత్త ఫీచర్‌ను లాంచ్ చేసింది. 4G టెక్నాలజీ ద్వారా నాణ్యమైన కాలింగ్ సదుపాయాన్ని యూజర్లు పొందవచ్చు. సాధారణ కాల్స్ కంటే మెరుగైన వాయిస్ క్లారిటీతో కాలింగ్ చేసుకోవచ్చు. ఈ సేవలను VoLTE గా పిలుస్తున్నారు. ఇతర టెలికాం సంస్థలు ఇప్పటికే ఈ సదుపాయాన్ని అందిస్తున్నాయి.
ప్రస్తుతం BSNL 4G లేదా 5G సిమ్ కార్డులు కలిగి యూజర్లు ఈ VoLTE ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకొనేందుకు అవకాశం ఉంది. ఇందుకోసం BSNL సిమ్ కార్డు నుంచి ACT VOLTE అని టైప్ చేసి 53733 నంబర్‌కు SMS చేయాల్సి ఉంటుంది. ఈ పద్ధతిలో సులభంగా యాక్టివేట్ చేసుకోవచ్చు.
ఇప్పటికి BSNL 2G లేదా 3G సిమ్ కార్డులను వినియోగిస్తున్నవారు 4G సిమ్ కార్డులకు అప్‌గ్రేడ్ కావాల్సి ఉంటుంది. ఇందుకోసం BSNL ఆఫీస్‌లు లేదా ఇతర కేంద్రాల ద్వారా ఉచితంగా సిమ్ కార్డులను పొందవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ రాష్ట్ర్రాల్లో 5G సిమ్ కార్డులను అందుబాటులోకి తీసుకొచ్చింది.
అయితే BSNL 4G నెట్‌వర్క్ ప్రస్తుతం పూర్తిస్థాయిలో అందుబాటులో లేదు. మరికొన్ని నెలల్లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. VoLTE ఫీచర్ ద్వారా అత్యంత నాణ్యమైన కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. ప్రస్తుతం BSNL తన సేవల్ని మెరుగుపరిచేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
BSNL నెట్‌వర్క్‌లోకి ఈ సంవత్సరం జులై నుంచి భారీ సంఖ్యలో యూజర్లు వచ్చి చేరుతున్నారు. ప్రైవేటు టెలికాం సంస్థలు జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా భారీగా మొబైల్ ఛార్జీలను పెంచాయి. దీంతో తక్కువ ధరకే సేవలు అందిస్తోన్న BSNL వైపు అనేక మంది యూజర్లు మొగ్గుచూపుతున్నారు. ఫలితంగా జులై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో భారీగా యూజర్లను బీఎస్‌ఎన్‌ఎల్ సంపాదించుకుంది.
ట్రాయ్ వివరాల ఆధారంగా..
అదే సమయంలో ప్రభుత్వ రంగ సంస్థ BSNL (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) కు కొత్తగా యూజర్లు వచ్చి చేరుతున్నారు. జులై నెలలో 29.2 లక్షలు, ఆగస్టులో 24.3 లక్షలు, సెప్టెంబర్‌లో 8.4 లక్షలు యూజర్ల BSNL నెట్‌వర్క్‌లో చేరారు. తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్‌లు అందుబాటులో ఉండడం సహా త్వరలో పూర్తిస్థాయిలో 4G అందుబాటులో వచ్చే అవకాశం ఉండడం కూడా ఇందుకు కారణంగా తెలుస్తోంది.
BSNL ఇటీవలే FTTH యూజర్లకు నేషనల్ వైఫై రోమింగ్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతోపాటు లైవ్ టీవీ యాప్‌లను లాంచ్ చేసింది. అయితే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఈ సర్వీస్ ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు. దీంతోపాటు D2D సర్వీసులను ప్రారంభించినట్లు ఇటీవలే టెలికాం మంత్రిత్వ శాఖ వెల్లడించింది.